‘ఏజెంట్’ తరవాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకొన్నాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ‘ఏజెంట్’ డిజాస్టర్ అవ్వడం ఒక ఎత్తయితే, యూవీలో ఒప్పుకొన్న సినిమా పట్టాలెక్కడానికి ఆలస్యమైంది. అయితే ఇప్పుడు యూవీ సినిమా పక్కన పెట్టిన అఖిల్, మురళీ కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ఆకట్టుకొన్న దర్శకుడు మురళీ. ఇప్పుడు ఈ సినిమా వర్క్ జరుగుతోంది. శ్రీలీలను కథానాయికగా ఎంచుకొన్నారు. ఈ సినిమా కోసం ‘లెనిన్’ అనే పేరు పరిశీలనలో వుంది.
ప్రస్తుతం ప్రతినాయకుడి కోసం వేట సాగుతోంది. ఇందుకోసం చాలా పేర్లు పరిశీలిస్తున్నారు. ఇద్దరు ఫైనల్ అయ్యారు. 1992 స్కామ్ తో ఆకట్టుకొన్న ప్రతీక్ గాంధీ అయితే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో వుంది చిత్ర బృందం. ప్రతీక్ తో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. అయితే కాల్షీట్ల ఇబ్బంది ఉంది. ‘లెనిన్’ టీమ్ అడుగుతున్న డేట్లు ప్రతీక్ దగ్గర లేవు. ప్రతీక్ కావాలంటే… అతను డేట్లు సర్దుబాటు చేసేంత వరకూ ఆగాలి. ప్రతీక్ కాకపోతే.. తమిళ నటుడు విక్రాంత్ ని తీసుకొనే అవకాశం వుంది. చిత్రబృందం కూడా విక్రాంత్ తో టచ్లో ఉంది. అయితే.. ‘లెనిన్’ మొదటి ఆప్షన్ అయితే మాత్రం ప్రతీక్ గాంధీనే. ఇదో లవ్ స్టోరీ అనే ప్రచారం జరుగుతోంది. కానీ కాదు. ‘లెనిన్’ పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ‘ఏజెంట్’ కూడా పూర్తి స్థాయి యాక్షన్ సినిమానే. అఖిల్ వయసుకి తగ్గ కథల్ని ఎంచుకొంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుంటారు. తనకు లవ్ స్టోరీలు పర్ఫెక్ట్. కానీ అఖిల్ మాత్రం ఎందుకనో యాక్షన్ మంత్రం జరిపిస్తున్నాడు.