వెండి తెరపై మరో పొలిటికల్ డ్రామా వస్తోంది. అదే ‘ప్రతినిధి 2’. మీడియాలో పాపులర్ అయిన టీవీ 5 మూర్తి దర్శకుడు కావడం, నారా రోహిత్ హీరోగా నటించడం, అన్నింటికంటే ‘ప్రతినిధి’ ఫ్రాంచైజీ కావడంతో ఈ సీక్వెల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పైగా ఎన్నికల సీజన్లో వస్తోంది కాబట్టి, ఆ ఫోకస్ ఇంకాస్త ఎక్కువైంది. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది.
ట్రైలర్ చూస్తుంటే… ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కళ్లకు కట్టినట్టే అనిపించింది. ప్రజాధనాన్ని నాయకులు దోచుకోవడం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, వాళ్ల బ్యాంకు బాలెన్సులు మాత్రం పెంచుకోవడం ఇదంతా.. నేటి రాజకీయ తంత్రమే.
”మన స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకొన్నారు? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు?” అనే ప్రశ్నతో.
”కొండ మీద కొబ్బరికాయ అమ్మా.. బండి మీద బత్తాయిలు అమ్మా.. ఊరకనే పెద్దవాళ్లు అయిపోతారేంటి” అనే డైలాగ్ వింటే.. తెలంగాణలో పేరు మోసిన ఓ రాజకీయ నాయకుడే గుర్తొస్తాడు. పథకాల పేరుతో ఓట్లు దండుకోవడం, ఆ తరవాత ప్రజాసంక్షేమం గాలికి వదిలేయడం ఈ వైనం ప్రస్తుతం ఏపీ నేతల్ని, అక్కడి పాలననీ గుర్తుకు చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలవడం కష్టమని, సంక్షేమ పథకాల బిస్కెట్లు అయిపోయాయని ఓ పాత్రతో చెప్పించారు. ఇది కూడా జగన్ సర్కార్‌పై వేసిన సెటైర్లానే అనిపిస్తుంది.
ఈ పొలిటికల్ డ్రామాలో యాక్షన్‌ని కూడా బాగానే మిక్స్ చేశారనిపిస్తోంది. ఉదయభాను చాలా కాలం తరవాత తెరపై కనిపించిన సినిమా ఇది. తన పాత్ర పవర్‌ఫుల్‌గానే ఉండబోతోందన్న హింట్ ట్రైలర్లో కనిపించింది. మొత్తానికి మీడియా ద్వారా రాజకీయాల్లోని లోపాల్ని ఎత్తి చూపే సినిమాగా ‘ప్రతినిధి 2’ రాబోతోందన్న విషయం ప్రేక్షకులకు అర్ధమైంది. మరి వాళ్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.