నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా… ‘ప్రతినిధి 2’. జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడి మారడం, ఎన్నికల సీజన్లో విడుదల అవుతుండడం వల్ల ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. దానికి తోడు టీజర్, ట్రైలర్లలో ఏపీలోని పాలక పక్షంపై సెటైర్లు బాగానే పడ్డాయి. అసలే ఎన్నికల వేడి, దానికి తోడు… పొలిటికల్ సెటైర్ కాబట్టి రోహిత్ కి మంచి రీ ఎంట్రీనే దొరికిందనుకొన్నారంతా.
అయితే ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ చిక్కుల్లో పడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేయడం కష్టమే అని తేలింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో, ఈ నెల 25న రావాల్సిన సినిమా ఆగిపోయింది. సెన్సార్ ఆఫీసర్ సెలవులో ఉండడం వల్ల సెన్సార్ సర్టిఫికెట్ దొరకడం కష్టమంటున్నారు. ఈ సినిమాని ముంబైలో సెన్సార్ చేసే అవకాశం ఉంది. అదీ వీలు కాకపోతే ఎన్నికలు అయ్యేంత వరకూ ఈ సినిమా విడుదల చేయడం కష్టమే. ఎన్నికలు అయ్యాక… ఈ వేడి తగ్గిపోతుంది. దాంతో `ప్రతినిధి` టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. అలా జరిగితే నిర్మాతల కష్టం అంతా వృధా అయినట్టే. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి. సెన్సార్ ఇబ్బందులు తలెత్తితే, నేరుగా ఓటీటీలో విడుదల చేసేసుకొనే వీలుంది. పే ఫర్ వ్యూ పద్ధతిన ఈ సినిమాని విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.