రాజకీయాలలో వ్యతిరేకతలు దాడులూ సహజమే గాని దానికో పరిమితి వుండాలి. టిడిపి నేతలూ, మంత్రులూ ప్రతిపక్ష వైసీపీ నేత జగన్పై దాడి చేయడం కూడా అందులో భాగమే. శాసనసభలోనూ తరచూ జగన్ఫై కేసులూ ఆరోపణలూ నడుస్తూనే వుంటాయి. కోర్టులు తేల్చే వరకూ బహుశా ఇది మారేది కాదు. అయితే ఆ ధోరణి శ్రుతిమించిపోవడమే అవాంఛనీయం. జగన్ ప్రతిపక్ష నేత కూడా కనుక రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాట్లాడ్డం సహజం. బాధ్యత కూడా. గత కొంతకాలంగా వదలిపెట్టిన ప్రత్యేక హౌదా సమస్యను మళ్లీ పైకి తీసి అనంతపురంలో యువభేరి నడుపుతున్నారు. ఈ సభలో ఆయన గతంలో చెప్పిన రాజీనామాల ప్రతిపాదన కూడా పునరుద్గాటించారు. తమ ప్రభుత్వంపై దాడిని టిడిపి ఖండించవచ్చు గాని హౌదా విషయంలో ఆయనను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే మంత్రులు పత్తిపాటి పుల్లారావు వంటివారు అలవాటైన దాడి బాణీలో ఈ సభపై ముందే విరుచుకుపడ్డారు. జగన్కు మాట్లాడే అర్హతే లేదన్నారు. అంతటితో ఆగక ఈ సభలకు వెళితే విద్యార్థులు క్రిమినల్స్ అవుతారని శాపనార్థాలు పెట్టారు. జగన్పై కోపంతో తాము ఏం మాట్లాడుతున్నారో అది ఎవరికి తగులుతుందో కూడా చూసుకోవడం లేదన్నమాట. ఇంతకూ ఒక రాజకీయ సమస్యపై సభకు వెళితే క్రిమినల్స్ అయ్యేట్టయితే ఇప్పటికి పెద్ద భాగం నేరస్తులై వుండాలి. ఎందుకంటే జగన్ సభలకు పర్యటనలకు లక్షల సంఖ్యలోనే జనం హాజరైనారు. వైసీపీపైన దాని నాయకుడిపైన రాజకీయంగా విమర్శలు చేయొచ్చు గాని విపరీతపు మాటలు ఉపయోగించడం మంత్రులకైనా తగనిపని.