ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాను ఎప్పుడూ కలవలేదని.. తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ చికోటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండో రోజు ఆయన సీసీఎస్ పోలీసుల్ని కలిశారు. ఏపీలో వైసీపీ నేతలతో తనకు పరిచయాలున్నాయని.. వారి వ్యవహారం అంతా తాను బయట పెట్టబోతున్నట్లుగా సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాజకీయ స్వార్ధం కోసం అపోజిషన్ పార్టీలు చేస్తున్న కుట్రగా అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తి అన్నట్లుగా ఆయన మాట్లాడి.. ప్రతిపక్షాలు అంటూ.. ఆరోపణలు చేయడం గమనార్హం. తాను చేసినట్లుగా సోషల్ మీడియా లో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించాలని పోలీసు లను కోరారు. ఫేక్ అకౌంట్ వల్ల తాను చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నానని తెలిపారు. పబ్లిక్ లో, మీడియా ముందు ఈ ఫేక్ అకౌంట్ వల్ల తాను బద్నాం అవుతున్నానన్నారు. వీలయినంత త్వరగా నిందితుడిని పట్టుకోవాలన్నారు.
అయితే ప్రవీణ్ చికోటికి ఏపీ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనే గతంలో చెప్పారు. వల్లభనేని వంశీ తనకు ప్రాణస్నేహితుడని ఇంటర్యూల్లో చెప్పారు. పలువురు వైసీపీ నేతలు కేసినోలకు చికోటి ద్వారానే వెళ్లేవారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఈడీ .. ఇలాంటి ప్రచారంలో నిజం ఎంతో తేల్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలను బయటకు తీసి… ఇందులో వైసీపీ నేతలు ఉంటే వారికి నోటీసులు ఇస్తారు. లేకపోతే లేదు. అయితే ఫేక్ అకౌంట్ అంటూ చికోటి ఏపీ ప్రతిపక్షాలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. రాజకీయం అయ్యే అవకాశం ఉంది.