ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో ఓ భారీ కుదుపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త అధికారవర్గాల్లో విస్తృతంగా తిరుగుతోంది. దీనికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయన.. ఢిల్లీకి వెళ్తారని.. చెబుతున్నారు. అయితే కేంద్రం పోస్టింగ్ కూడా.. మరో వారంలో ఇస్తుందని… చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడుపోస్టింగ్ కేటాయిస్తే.. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ సిద్ధమవుతున్నారు. ఏపీ సీఎంవోలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్…హఠాత్తుగా ఢిల్లీ సర్వీసులకు వెళ్లాలనుకోవడం అధికావర్గాల్లో పెను సంచలనానికి కారణం అవుతోది.
సీఎంవో ముఖ్యకార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. మొత్తం ప్రభుత్వ వ్యవహారాలను అంతా తానై నడుపుతున్నారు. చీఫ్ సెక్రటరీకి కూడా లేనంత ప్రాధాన్యత ఆయనకు ఉంది. నేరుగా జీవోలు ఇచ్చేయగల స్వేచ్చ కూడా ముఖ్యమంత్రి ఆయనకు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ఆయన ముద్ర ఉంది. ముఖ్యంగా ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే మూడు రాజధానుల అంశంలో భాగంగా.. విశాఖకు పాలనా రాజధానిని తరలించే విషయంలోనూ ఆయన పాత్ర కీలకం. ఇళ్ల స్థలాలను స్వయంగా వెళ్లి పరిశీలించి వస్తూ ఉంటారు. మూడు రాజధానుల కోసం… విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడానికి అన్ని పనులూ ఆయనే చేస్తూంటారు. మొత్తం ఆయన చేతుల మీదుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా అన్నీ వదిలేసి ప్రవీణ్ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారనే దానిపై ఎవరికీ క్లూ లేకుండా పోయింది.
ప్రవీణ్ ప్రకాష్.. ముఖ్యమంత్రికి తెలిసే కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేస్తున్నారా లేక.. . తనకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేక.. రహస్యంగా చేసుకున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే.. ఆయన రిలీవ్ కావడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని… ఆయన స్థానంలోకి సీఎంవోలోకి రావత్ ను తీసుకుంటారని మాత్రం… అధికార పార్టీ వైపు నుంచి ప్రచారం బయటకు వచ్చింది. ప్రవీణ్ ప్రకాష్ .. సమర్థమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయితే.. ఆయన వ్యవహారశైలితో మాత్రం… యంత్రాంగం మొత్తం ఇబ్బంది పడింది. ప్రభుత్వంపై కోర్టులు అనేక సార్లు విరుచుకుపడటానికి కూడా.. ప్రవీణ్ ప్రకాష్ కారణం అని చెబుతారు. ప్రవీణ్ రిలీవ్ అయిన తర్వాత… ఆయన ఢిల్లీకి వెళ్లడానికి అసలు కారణాలేమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.