ఆంధ్రప్రదేశ్ అధికారవర్గానికి బాస్ ఎవరు..? మామూలుగా అయితే చీఫ్ సెక్రటరీ బాస్. అధికారులు మొత్తం చీఫ్ సెక్రటరీ చెప్పినట్లే వినాలి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నం. చీఫ్ సెక్రటరీ కూడా.. తాను చెప్పినట్లే వినాలంటారు.. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. లేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా.. అని ఆయన చెప్పాల్సిన పని లేదు.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్తుకు వచ్చేస్తుంది. ఆయనకు షోకాజ్ ఇచ్చినందుకు.. సీఎస్‌గా ఆయన కెరీర్‌కు ప్రవీణ్ ప్రకాష్.. తన సంతకంతోనే ముగింపు పలికారు. ఆయన తర్వాత నీలం సహాని వచ్చారు. ఇప్పుడు.. ఆమెతోనూ ప్రవీణ్ ప్రకాష్‌కు సరిపడటం లేదంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి.. ప్రవీణ్ ప్రకాష్ మీదే లెక్కలేనంత గురి. ప్రస్తుతం విశాఖపట్నానికి రాజధాని తరలింపు అంశాలను .. ప్రవీణ్ ప్రకాష్ దగ్గరుండి చూస్తున్నారు.
గతంలో ఆయన ఆ జిల్లాకు కలెక్టర్ గా చేశారు. ఎక్కడెక్కడ భూములున్నాయో తెలుసు. అందుకే… రాజధానిని విశాఖ తరలించాలనుకున్న జగన్.. మొత్తం బాధ్యతలు అనధికారికంగా ఆయినా ఆయనకే అప్పగించారు. వాటితో పాటు ఇతర అంశాలపైనా ప్రవీణ్ ప్రకాష్‌దే పూర్తి ఆధిపత్యం. సీఎస్ జారీ చేయాల్సిన ఆదేశాలను కూడా.. ఆయనే జారీ చేస్తున్నారు. దీంతో నీలం సహాని నొచ్చుకుంటున్నట్లుగా అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనను సీఎస్‌గా జగన్ స్వయంగా పిలిచి నియమించారని.. ఇప్పుడు తీరా.. తనను డమ్మీగా చేయడం ఏమిటన్నది నీలం సహాని ఆవేదన. ఇటీవల.. తాను జారీ చేయాల్సిన ఉత్తర్వులను రెండు, మూడు.. ప్రవీణ్ ప్రకాష్ జారీ చేయడంతో ఆమె.. హర్టయ్యారని అంటున్నారు.
ప్రవీణ్ ఈ విషయంపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మరింత ఆవేదనకు గురయ్యారని అంటున్నారు. నీలం సహాని.. ఈ విషయంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే అలోచనలో ఉన్నారని చెబుతున్నారు. కానీ.. నీలం సహాని రిటైరయ్యేవరకూ.. అలాగే ఉండటం బెటరని.. లేకపోతే.. ఎల్వీ సుబ్రహ్మణ్యంలా.. ప్రాధాన్యత లేని పోస్టుకు వెళ్లాల్సి ఉంటుందని.. ప్రభుత్వంలోని కొందరు సీనియర్ ఐఏఎస్‌లు జోకులేసుకుంటున్నారు.