హనుమంతప్ప…. ఎక్కడో కర్ణాటకకు చెందిన వాడు. ఆర్మీలో లాన్స్ నాయక్ గా పనిచేస్తున్నాడు. సియాచిన్ లో ఎముకలు కొరికే చలిలో, మంచు చరియల కింద ఆరు రోజులున్నా, చావును జయించిన ధీరుడు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో మనిషనే వాడు అన్ని రోజులు బతకడం కష్టమని డాక్టర్లే చెప్తున్నారు. అయినా, అతడి శారీరక దృఢత్వం, మానసిక ధీరత్వం వల్ల మృత్యుంజయుడయ్యాడు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంతటి ధీరుడు బతకాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు పూజలు చేస్తున్నారు. ప్రార్థనలుచేస్తున్నారు. యాగాలు చేస్తున్నారు. ముంబైలో డబ్బావాలాలు అతడి కోసం పూజలు చేశారు. ఎలాగైనా అతడిని బతికించమని దేవుడిని ప్రార్థించారు. భోపాల్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పూజలు చేశారు. ప్రత్యేకంగా ఓ యాగం జరిపారు. హనుమంతప్పను ఎలాగైనా బతికించాలంటూ దేవుళ్లకు మొక్కుకున్నారు. ఎంతో మంది ప్రముఖులు కూడా అతడు బతకాలంటూ ప్రార్థించారు. భరతమాత వీరపుత్రుడు మళ్లీ మామూలు మనిషిలా మన ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిలో తమ ఆకాంక్షను వెల్లడించారు. సోషల్ మీడియాలో హనుమంతప్ప హీరో అయ్యాడు. ఢిల్లీలో అతడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లారు. లాన్స్ నాయక్ హోదా గల సైనికుడిని పరామర్శించడానికి ప్రధాని వెళ్లడం అత్యంత అరుదైన విషయం. అయినా, వీర జవాను ధీరత్వానికి కదిలిపోయిన మోడీ, ప్రోటోకాల్ ను పక్కన పెట్టి పరుగు పరుగున వెళి ఆ ధీరుడిని చూశారు. ఆరోగ్యం ఎలా ఉందని డాక్టర్లను అడిగారు. ఎలాగైనా అతడిని బతికించాలని కోరారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్లమీద ఉన్న అతడికి అవసరమైన ఆధునిక చికిత్సను అందిస్తున్నారు. ఆర్మీ మొత్తం అతడిపైనే దృష్టి పెట్టింది. ఆర్మీ చీఫ్ ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. హనుమంతప్ప బతికి బయటకు వస్తే అది అతడి కుటుంబానికే కాదు, యావత్ దేశానికే పండుగ రోజు అవుతుంది. భారతీయ సైన్యంలో ఇలాంటి ధీరులున్నారని లోకానికి మరోసారి చాటినట్టు అవుతుంది. హనుమంతప్పా… గెట్ వెల్ సూన్.