హైదరాబాద్: అయుత చండీ మహా యాగాన్ని విజయవంతంగా చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రయుత చండీ మహాయాగాన్ని చేస్తానంటున్నారు. నిన్న అయుత చండీయాగం ముగిసిన తర్వాత యాగంలో పాల్గొన్న వేదపండితులు, రిత్విక్కులు, భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, యాగాలు, హోమాలు తనకు కొత్త కాదని అన్నారు. అయుత చండీయాగంలో, తమ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ(వాటర్ గ్రిడ్), మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తికావాలని తాను కోరుకున్నానని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యి, తెలంగాణ రైతులు అభివృద్ధి చెందితే ప్రయుత చండీయాగం చేస్తానని మొక్కుకున్నానని అన్నారు.
అయుత చండీ మహాయాగంలో మహాదుర్గను ప్రసన్నం చేసుకోవటంకోసం సప్తశతి అనబడే 700 శ్లోకాలను 10,000 సార్లు పారాయణం చేస్తే, ప్రయుత చండీయాగంలో సప్తశతి శ్లోకాలను పది లక్షలసార్లు పారాయణం చేస్తారు… లక్ష హోమాలు చేస్తారు. త్వరలో కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్ళి భారతీ తీర్థ మహాస్వామికి అయుత చండీమహా యాగం విజయవంతంగా పూర్తయిన విషయాన్ని తెలియజేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు. యాగాన్ని నిర్వహించిన కీలక వ్యక్తులు, వేదపండితులు, 2,500 మంది రిత్విక్కులను ఇతర కానుకలు, సంభావనలతో కేసీఆర్ దంపతులు సత్కరించారు. ముఖ్యులు 23 మందికి ప్రత్యేకంగా స్వర్ణకంకణాలు తొడిగి సన్మానించారు.