హైదరాబాద్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన విషయంల ఏమిటంటే కూల్చివేతలు. ఇల్లు కొనాలనుకునే.. కొనుక్కున్న.. అమ్ముకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడీ అంశం గుబులు పుట్టిస్తోంది. చాలా మంది ఇప్పటి వరకూ అందరూ హోమ్ లోన్ వస్తే..అంతా పర్ ఫెక్ట్ గా ఉందని అనుకునేవారు. ఎందుకంటే.. హోమ్ లోన్ రావాలంటే ఆయా బ్యాంకులు ఆస్తులను తనఖా పెట్టుకుంటాయి. అన్నీ సరిగ్గా ఉంటేనే పెట్టుకుంటాయి. లేకపోతే లేదు. కానీ ఇప్పుడు హోమ్ లోన్లు వచ్చిన ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. అంటే.. హోమ్ లోన్ వచ్చినా సరే కబ్జాలు లేదా మరో అక్రమం ఉండొచ్చు.
హోమ్ లోన్ ఇచ్చే సంస్థలు రియల్ ఎస్టేట్ నిపుణులు, న్యాయకోవిదులతో తాము లోన్ ఇవ్వబోయే ఇంటి పత్రాలను తనిఖీ చేయిస్తాయి. అందులో సందేహం లేదు. వారికి ఏ మాత్రం డౌట్ వచ్చినా లోన్ ఆపేస్తాయి. ఈ విషయంలో ఎవరూ అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. అన్ని పర్ ఫెక్ట్ గా ఉన్న వాటికే లోన్లు వస్తాయి. కానీ లోన్లు వచ్చిన అన్నీ పర్ ఫెక్ట్ కాదని ఇటీవల ఘటనలు నిరూపిస్తున్నాయి. దీనికి కారణం… అధికారులు, బిల్డర్లతో.. బ్యాంకర్లు కూడా కుమ్మక్కు కావడమే. లోన్ ఇప్పిస్తే…కమిషన్లు ఇస్తారు. అందుకే కొంత మంది .. అది అక్రమ కట్టడం అనడానికి ఆధారాలున్నా దాచి పెట్టి లోన్ మంజూరు చేసేలా వ్యవహరిస్తున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్ అయితేనే లోన్ వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రార్లు కూడా వీరితో జత కలుస్తున్నారు.
అమ్ముతున్నది ప్రభుత్వ భూమా… లేకపోతే చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోనా అన్నది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు . హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో అక్రమ లే ఔట్ల పూర్తి వివరాలు ఉన్నాయి. అంతే కాదు.. ఏదైనా భూమి కొనుగోలు చేయాలనుకంటే.. దాని లింక్ డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించారు. అది అనాదిగా ప్రైవేటు ఆస్తిగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు. కానీ ఏదో ఓ దశలో అది ప్రభుత్వ భూమిగా నమోదయి ఉంటే మాత్రం .. కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. కానీ ప్రభుత్వమే వేలంలో అమ్మేసి ఉన్న భూమి అయితే కళ్ల మూసుకుని కొనుగోలు చేసుకోవచ్చు.
బ్యాంకర్లు ..కక్కుర్తితో చేసే అక్రమాల వల్ల… రెండు వైపులా నష్టం జరుగుతోంది. ఇల్లు కోల్పోయిన వారు ఈఎంఐ కట్టలేరు. దాని వల్ల అతని ఆర్థిక భవిష్యత్ అంధకారం అవుతుంది. డబ్బులు కోల్పోయిన బ్యాంకు, ఆర్థిక సంస్థ కూడా నష్టపోతుంది. అందుకే.. ఇక నుంచి ఇల్లు కొనుగోలు చేసేవారు.. బ్యాంక్ లోన్ వస్తే చాలు అంతా బాగున్నట్లే అనుకోకూడదు.