ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా..కొనాలన్నా 90 శాతం మంది హోమ్ లోన్స్ మీద ఆధారపడుతున్నారు. ఇల్లు కొనాలంటే వంద శాతం రుణం లభించడం కష్టం. అలా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యాభై లక్షల రూపాయల విలువైన ఇల్లు తీసుకుంటే అసలు చేతిలో డబ్బులు లేకుండా కొనడం ఆర్థికపరంగా తప్పుడు ప్రాక్టీస్ అవుతుంది. ఎంతో కొంత సేవ్ చేసుకుని డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన మొత్తానికి లోన్ తీసుకోవడం. కనీసం ఇరవై శాతం అయినా డౌన్ పేమెంట్ కడితే మంచిదని నిపుణుల సలహా. ఇరవై శాతం అంటే యాభై లక్షల ఇంటికి పది లక్షల రూపాయలు. మిగిలిన నలభై లక్షలు లోన్ గా పెట్టుకోవచ్చు.
డౌన్ పేమెంట్‌ను పూర్తిగా సొంత డబ్బు నుంచే చెల్లించాలి. దాని కోసం అప్పు చేయకూడదు. మిగిలిన డబ్బు చెల్లింపు కోసం హౌమ్ లోన్ తీసుకుంటారు కాబట్టి అది కూడా దీర్ఘ కాలిక అప్పు అవుతుంది. ఫ్లాట్ సైజ్‌తో సంబంధం లేకుండా, డౌన్ పేమెంట్ ఎప్పుడూ ఫ్లాట్ ధర ఆధారంగా నిర్ణయించుకుంటే మంచిది. ఫ్లాట్ పరిమాణం ఎంత ఉన్నప్పటికీ, గృహ రుణ గ్రహీత చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ మొత్తం ఆ ఫ్లాట్ ధరపై ఆధారపడి ఉంటుంది.
ఇల్లు కొనుగోలు అనేది ఓ బైక్ లేదా కారు కొనుగోలు అంత ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదు. సుదీర్ఘ కాలం రుణభారం ఉండే ఓ ఆస్తి. జాగ్రత్తగా చూసుకుంటే..రుణం కంటే ఎక్కువగా ఆస్తి విలువలో పెరుగుదల వస్తుంది. అయితే అత్యధిక వడ్డీకి.. ఇతర మార్గాల నుంచి కూడా అప్పులు చేసి .. డౌన్ పేమెంట్, ఇంటీరియర్ వంటి ఖర్చులకూ అప్పులు చేస్తే ఇల్లు పెను భారం అవుతుంది. అది అప్పులు మిగిల్చి చేజారిపోయే అవకాశం ఉంది.