తెలంగాణా బడ్జెట్ తతంగం అయిపోయింది. ఇప్పుడికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ హంగామా మొదలైంది. ఆ బడ్జెట్ ఎలా ఉన్నా..అసలు ఏమీ అర్థం కాకపోయినా సరే……….మా బాబుగోరి బడ్జెట్ కేక, తోపు, అదిరిపోయింది…..ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడుతో పాటు టిడిపి అనుకూల మీడియాలో వార్తలు రావడం ఖాయం. మనుషుల్నికులాలుగా చూడడం ఎప్పుడో మొదలెట్టేశారు కాబట్టి ….అన్ని కులాల జనాలు ఆనందంతో ఓలలాడుతున్నారని బాబు భజన మొదలెట్టడం ఖాయం. అలాగే అన్ని కుల సంఘాల నాయకులను కూడా చంద్రబాబుకు సన్మానం చేయడం కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టి ఉంచారు. బడ్జెట్ ప్రసంగం అయిపోయిన వెంటనే ఆ కుల సంఘాల వాళ్ళందరూ చంద్రబాబుకు సన్మానం చేయడం ఖాయం. అలా బడ్జెట్ సూపర్ అని జనాలందరినీ నమ్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు చంద్రబాబు.
ఇక అదే బడ్జెట్ చెత్త…పరమ చెత్త… ఇదే ది బెస్ట్ చెత్త అని ప్రజలకు వివరించడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా అన్నే పాట్లు పడతాడనడంలో సందేహం లేదు. బడ్జెట్లో ఎక్కువ శాతం అబద్ధాలే ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్ లెక్కలు కూడా ఇప్పుడు సినిమా కలెక్షన్స్ లెక్కల్లాగే తగలడ్డాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, రాష్ట్రం అప్పుల పాలవుతున్నా…కేంద్రం నుంచి ఒక్క రూపాయి సాయం లేకపోయినా……బడ్జెట్ లెక్కలు, కేటాయింపులు మాత్రం పెంచుతూపోవాల్సిందే. లేకపోతే చంద్రబాబుకి ఇమేజ్ ప్రాబ్లం. అన్ని అబద్ధపు లెక్కల్లో కూడా ఎక్కడో ఒకచోట కొన్ని అయినా నిజాలు ఉంటాయి. కనీసం ఆ నిజాలను గుర్తించడానికి కూడా జగన్ ఇష్టపడడు. బడ్జెట్ అంతా వేస్ట్ అని జనాలకు చెప్పడానికి అష్టకష్టాలు పడతాడు.
అధికార, ప్రతిపక్షాల హంగామా అంతా కూడా ఓ రెండు రోజుల షో. బాహుబలి సినిమాలాగా బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చేమో. అంతోటిదానికి ఆ బడ్జెట్తోనే జనాల జీవితాలన్నీ ముడిపడి ఉన్నట్టుగా మీడియా బిల్డప్ ఒకటి. తాము రూపొందించిన బడ్జెట్ లెక్కల ప్రకారం ఖర్చుపెట్టిన ముఖ్యమంత్రి ఒక్కరన్నా ఉన్నారా? బడ్జెట్ షో అయిపోగానే చిత్తానికి చిట్టా పద్దులు రాసుకుంటూ వెళ్ళడమేగా. మరి ఈ షో ఎందుకు అంటే…అదంతే. ప్రజల కోసం మేం కష్టపడతున్నాం అని చెప్పుకోవడానికి ఇలాంటి హంగామాలు నాయకులకు, వాళ్ళనే నమ్ముకుని…వాళ్ళ భజన చేసేస్తూ బ్రతికేస్తున్న మీడియా బ్రతకడం కోసం చాలా చాలా అవసరం.