హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రీలాంచ్‌ల పేరుతో చేసిన మోసాలు బయటపడేకొద్దీ బయట పడుతున్నాయి. ఇప్పటికి వారానికో మోసం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా సాయిసూర్య డెవలపర్స్ పేరుతో భారీగా ప్రచారం చేసుకుని ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేసిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సాయి సూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీష్ చంద్రను జైలుకు పంపారు.
ఐటి కారిడార్‌కు సమీపంలో రియల్ ఎస్టేట్ పరంగా మంచి డిమాండ్ ఉండే వట్టి నాగుల పల్లి కేంద్రంగా కంచర్ల సతీష్ చంద్ర రియల్ ఎస్టేట్ మోసాలకు తెర తీశాడు. తనది కాని స్థలంలో వెంచర్లు వేస్తున్నామని ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించారు. అతి తక్కువకు వస్తాయన్న ఆశతో చాలా మంది డబ్బులు కట్టారు. ఇలా పది కోట్లవరకూ వసూలు చేశారు. కానీ ప్రాజెక్టు ముందుకు పడలేదు. ఈ మోసంలో భాగ్యనగర ప్రాపర్టీస్ అనే మరో సంస్థ కూడా పాలు పంచుకుంది. ఆ సంస్థ ఎండీ నరేందర్‌తో కలిసి మరిన్ని మోసాలు చేశారు. ఆయననూ పోలీసులు అరెస్టు చేశారు. వీరి పని రియల్ ఎస్టేట్ లో మోసం చేయడమే. ఇప్పటికే సతీష్‌చంద్రపై 11 కేసులు నమోదు అయినట్లుగా గుర్తించారు.
ప్రజల ఆశల్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఎవరెవరో చెప్పారని చెప్పి అతి తక్కువకు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టేస్తున్నారు. అవి గోడకు కొట్టిన సున్నంలా మారుతున్నాయి. ఇప్పుడు సాయి సూర్య లేదా భాగ్యనగర్ సంస్థల యజమానుల్ని అరెస్టు చేశారు. కానీ వారికి కట్టిన డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. బడా సంస్థల నుంచి కింది స్థాయి వరకూ వేల కోట్లు ప్రీలాంచ్‌ల పేరుతో మోసాలకు పాల్పడ్డారు. వినియోగదారుల అప్రమత్తతే వారికి రక్షణ …లేకపోతే వారు కష్టపడిన సొమ్ము ఇలాంటి వారి చేతుల్లో పడిపోతుంది.