రాజశ్రీ పిక్చర్స్, సూరత్ బర్జాత్యా… ఈ పేర్లు వినగానే హమ్ ఆప్కే హై కౌన్ వంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. రాజశ్రీ వారి సినిమాల్లో తరచూ సల్మాన్ ఖాన్ కనిపిస్తూ ఉంటాడు. పైగా ప్రేమ్ అనే పాత్రతో అభిమానులకు కనువిందు చేస్తుంటాడు. ఇప్పుడు ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాను రాజశ్రీ వారు నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇదీ కాపీ అని బాలీవుడ్ లో టాక్.
ఆశ్చర్యం ఏమిటంటే, అప్పుడెప్పుడో 1894లో వచ్చిన ది ప్రిజనర్ ఆఫ్ జెండా అనే నవలను కాపీ కొట్టి ఈ సినిమాను తీశారని ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కథనాన్ని రాసింది. ఆంథోనీ హోప్ రాసిన ఆ నవల ఆధారంగా హాలీవుడ్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయట. ప్రేం రతన్ ధన్ పాయో ఐడియాను అమాంతం ఆ నవల నుంచి కాపీ కొట్టారనేది లేటెస్ట్ టాక్ సారాంశం.
సాధారణంగా రాజశ్రీ వారి సినిమాల్లో భారతీయ సంప్రదాయం ఉట్టిపడుతుంది. కుటుంబ విలువలు ఎక్కువగా కనిపిస్తాయి. క్రూరమైన విలన్లు, ఘోరమైన ఫైట్లు, ఎబ్బెట్టు సీన్లు, మోతాదు మించిన అందాల ఆరబోత వంటివి ఉండవు. మరి ప్రేం రతన్… నిజంగా కాపీనా లేక వెబ్ సైట్ కథనం ఊహాగానమేనా అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాలి. ఈ సినిమాలో క్యూట్ గర్ల్ సోనం కపూర్ హీరోగా నటిస్తోంది. సోనం తండ్రి అనిల్ కపూర్ కంటే కేవలం ఐదారు సంవత్సరాలు చిన్నవాడైన సల్మాన్ కు జోడీగా సోనం రొమాన్స్ చేసింది. అదేమిటంటే నేను ఏ అమ్మాయి పక్కనైనా రొమంటిక్ హీరోనే అంటున్నాడు సల్మాన్.
సోనం కపూర్ గెటప్ కోసం సూరజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రోమోస్, ఫొటోస్ చూసిన వారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత అందంగా, విభిన్నమైన గెటప్ లో సోనం కనువిందు చేస్తుందట. ఈ మధ్య వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇందులో కాస్త స్లిమ్ గా ఉన్నట్టు కనిపిస్తోందని బాలీవుడ్ లో మరో టాక్ వినిపిస్తోంది. కండల వీరుడితో క్యూటీ బేబీ రొమాంటిక్ సీన్లు ఏ రేంజిలో అభిమానులను గిలిగింతలు పెడతాయో త్వరలోనే తెలుస్తుంది.