హైదరాబాద్: సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ మొదటి మూడు రోజులలోనే రు.100 కోట్ల మైలురాయిని దాటేసింది. దీపావళి మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,600 ధియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిందీ వెర్షన్ ఒక్కటే ఈ ఘనతను సాధించటం విశేషం. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమలీల’ పేరుతో, తమిళంలో ‘మై మరంతాయో అంబే’ పేరుతో డబ్ అయింది. ఆ చిత్రాల కలెక్షన్స్ చేర్చకుండానే మూడు రోజులలో వందకోట్ల క్లబ్లో చేరింది. గురువారం మొదటి రోజున రు. 40.35 కోట్లు, శుక్రవారం రెండో రోజున రు.31.05 కోట్లు, శనివారం మూడో రోజున రు.30.07 కోట్లు గడించింది. అయితే మొదటి రోజు ఓపెనింగ్స్‌లో షారుఖ్ ఖాన్ ‘హ్యాపీ న్యూఇయర్’ చిత్రంతో నెలకొల్పిన రు.42.62 కోట్ల రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ మూడు వెర్షన్స్ కలిపి రు.44.97 కోట్లు గడించింది. మరోవైపు ‘బాహుబలి’ మూడు వెర్షన్స్ కలిపిన ఓపెనింగ్స్ రికార్డ్ కూడా ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. ఈ చిత్రం మొదటిరోజున మూడు వెర్షన్స్ కలిపి రు.50 కోట్లు గడించింది. రివ్యూలలో మిశ్రమ స్పందన వ్యక్తమయినప్పటికీ కలెక్షన్స్ బాగుండటం ఈ చిత్రంలో మరో విశేషం.