Premalu Movie Review Telugu
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్
ఓ మంచి సినిమాకి ఏం కావాలి? మంచి కథ, అందులో సరిపడేంత సంఘర్షణ, సాంకేతిక నిపుణుల బలం, పేరున్న నటీనటులు.. వగైరా, వగైరా… ఇలా చాలా చాలా చెబుతారు. కానీ ఇవేం లేకుండా కూడా ఓ సింపుల్ టెక్నిక్‌తో ఓ మంచి సినిమా తీయొచ్చు. ఓ మామూలు కథని ఆద్యంతం ఆహ్లాదకరంగా చెప్పినా అది మంచి సినిమానే అవుతుంది. మలయాళంలో వచ్చిన ‘ప్రేమలు’లా. ఈ మలయాళం దర్శకులు పడితే గొప్ప కథ పట్టేస్తారు. లేదంటే ఓ మామూలు కథనే గొప్పగా చెప్పేస్తుంటారు. ‘ప్రేమలు’ రెండో వర్గానికి చెందుతుంది. ఈ సినిమాలో గొప్ప కథేం లేదు. స్టార్ బలం లేదు. టెక్నీషియన్లు హేమాహేమీలు కాదు. ఉన్నదల్లా మనసుని గిలిగింతలు పెట్టే సన్నివేశాలు, సందర్భాలు మాత్రమే! ఆ ఆసరాతోనే మలయాళంలో బాగా ఆడేసింది. ఆ నమ్మకంతో ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు. మరి అక్కడి మ్యాజిక్ ఇక్కడ వర్కవుట్ అయ్యిందా?
సచిన్ (నస్లేన్)ది కాలేజీలో లవ్ ఫెయిల్యూర్. ఇంట్లో అమ్మానాన్నలకు క్షణం కూడా పడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊర్లో ఉండలేక.. యూకే వెళ్లిపోదాం అనుకొంటాడు. కానీ వీసా సమస్య. వీసా దొరకాలంటే మరో ఆరు నెలలు చూడాలి. ఆ గ్యాప్‌లో గేట్ కోచింగ్ పేరుతో స్నేహితుడు అముల్ (సంగీత్ ప్రతాప్)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ రేణూ (మమిత బైజు)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. రేణు ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంటుంది. తనకు కాబోయే వాడి విషయంలో రేణుకి కొన్ని ఆలోచలు, ఆశలు ఉన్నాయి. వాటికి సచిన్ దరిదాపుల్లోకి కూడా రాడు. సచిన్‌తో స్నేహాన్ని, కంపెనీని రేణు ఇష్టపడుతుంది. కానీ అది ప్రేమ కాదు. అలాంటప్పుడు సచిన్ తన మనసులో మాట రేణుకి చెప్పాడా? చెబితే ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది మిగిలిన స్టోరీ!
`ప్రేమలు` కథని రెండు ముక్కల్లో చెబితే, ఇందులో కథేముంది? కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? అంటూ పెదవి విరచడం సహజం. నిజంగానే ఇందులో కథ, కాకరకాయి, కాన్ఫ్లిక్ట్ వగైరాలూ ఏం లేవు. ఉన్నా అవి బలంగా అనిపించవు. కానీ.. దర్శకుడు చాలా సింపుల్ ట్రీట్మెంట్తో ఈ కథని ఆహ్లాదభరితంగా మలిచాడు. క్యారెక్టర్లైజేషన్లు, వాటిలోంచి పుట్టే సరదాలతో – ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా చూస్తున్నంత సేపూ ఏదో ఓ రూపంలో నవ్వుల్ని పంచుకొంటూ వెళ్లాడు. ప్రేమ, అందులో ఓడిపోవడం, మరో అమ్మాయిని ప్రేమించడం… యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఫార్ములా. దర్శకుడు మళ్లీ అదే పట్టుకొన్నాడు. దాన్ని మలచడంలో మాత్రం తనలోని రైటర్ని పదును పెట్టాడు. హీరో స్నేహితుడు అమూల్, హీరోయిన్ వెంట పడే ఆది క్యారెక్టర్లను రాసుకోవడం దగ్గరే దర్శకుడు ఈ సినిమాని హిట్ చేసేశాడు. ఆ రెండు పాత్రలూ ఎప్పుడు కనిపించినా, ఫన్ దొర్లుకొంటూ వచ్చేస్తుంది. అదృష్టం ఏమిటంటే అమూల్, ఆది.. ఎప్పుడూ తెరపై కనిపిస్తూనే ఉంటారు. అందుకే వినోదానికి ఎక్కడా లోటు ఉండదు.
ఈ కథని చాలా స్లోగా, ఓ రకంగా చెప్పాలంటే చాదస్తపు టేకింగ్ తో మొదలెట్టాడు దర్శకుడు. పాత్రలు, వాటి గమ్యాలూ అర్థం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. కాకపోతే.. ఒక్కసారి బండి పట్టాలెక్కాక ఇక ఆగదు. కథలో కాన్ఫ్లిక్ట్ చాలా అవసరం అని సినిమా మేధావులు చెబుతుంటారు. ఎక్కడో ఓ చోట సంఘర్షణ పుట్టించడానికి కథకులు, దర్శకులు పాట్లు పడుతుంటారు. కానీ ఇక్కడ దర్శకుడు అదేం చేయలేదు. కథని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పాత్రలపై వేసేశాడు. అవే ఈ కథని మోసుకొంటూ వెళ్లాయి. పెళ్లిలో చేసే హంగామా, రోజంతా హైదరాబాద్ వీధుల్లో తిరగడం.. ఇవేం కథని ముందుకు నడిపంచే సందర్భాలు, సన్నివేశాలూ కావు. కానీ.. చూడ్డానికి బాగుంటాయి. ఇది కాలేజీ కథ కాదు. కార్పొరేట్ కథ కాదు. ఆ మాటకొస్తే ప్రేమకథ కూడా కాదు. ఫ్రెండ్షిప్ కథ అస్సలు కాదు. కానీ అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఎక్కడ, ఏది వాడుకొన్నా, ఓ జోనర్‌ని దర్శకుడు టచ్ చేసినా, తెలివిగా వినోదమే పిండుకొన్నాడు. అందుకే కథ, కాన్ఫ్లిక్ట్, లాజిక్కుల మీద మనసు మళ్లదు.
‘అక్కడ స్పేస్ లేదు.. కానీ కావాలని తీసుకొన్నాడు’ అనేది త్రివిక్రమ్ పాపులర్ డైలాగ్. దర్శకుడు కూడా అలాంటి స్పేస్‌లు కావాలని తీసుకొన్నాడు. అవన్నీ మంచి ఫలితాలనే అందించాయి. ముఖ్యంగా తెలుగు రైటింగ్ ఈ సినిమాకి చాలా ప్లస్. 90స్ వెబ్ సిరీస్ అందించిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి మాటలు అందించారు. ఆయన కూడా కావల్సినంత స్పేస్ తీసుకొన్నట్టు అర్థం అవుతోంది. కొన్ని చోట్ల.. అవసరం లేకపోయినా, సందర్భం రాకపోయినా పనిగట్టుకొని మరీ కొన్ని సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగులు వాడారు. అవి అనుకొన్నదానికంటే థియేటర్లో బాగా పేలాయి. కుమారి అంటీ, కుర్చీని మడతపెట్టి, ఆవేశం స్టార్.. ఇలా ఒకటా రెండా? ప్రతీ సీన్లోనూ ఒకటో, అరో…పేలుతూనే ఉంటుంది. సన్నివేశాలు, క్యారెక్టర్లు లైవ్లీగా ఉంటే, ఫన్ ఎంత బాగా పండుతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. సినిమాలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. కాబట్టి.. తెలుగు సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది.
ఈ సినిమాలో కనిపించిన ఆర్టిస్టుల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండకపోవొచ్చు. కానీ.. సినిమా నడుస్తున్న కొద్దీ వాళ్లతో మన స్నేహం మొదలై, చివరికంటూ వచ్చేసరికి వాళ్లతో ప్రేమలో పడిపోతాం. నస్లేన్.. కొంతకాలం గుర్తుండిపోతాడు. తన సహజసిద్ధమైన నటన ఈ సినిమాకు ప్లస్. మమిత ఈ సినిమాతో స్టార్ అయిపోతుంది. అంత క్యూట్ గా ఉంది. అమూల్ పాత్రలో నటించిన సంగీత్ మన ఫ్రెండ్స్ లిస్టులో చేరిపోతాడు. ఆది కూడా అంతే. వీళ్లలో ఎవరివీ సినిమాటిక్ ఫేసులు కావు. బయటకు వెళ్తే పదిమందిలో వెదికితే ఆరుగురో, ఏడుగురో వీళ్లే ఉంటారు. అందుకే అంత త్వరగా కనెక్ట్ అయిపోతారు.
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్