ఈమధ్య మలయాళంలో బాగా హిట్టయిన చిన్న సినిమా ‘ప్రేమలు’. తెలుగు రైట్స్ కోసం చాలా హడావుడి జరిగింది. చివరికి రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు రైట్స్‌ని దక్కించుకొని ఈనెల 8న విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. మలయాళ ట్రైలర్ వెర్షనే… యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో విడుదల చేశారు. కాకపోతే.. తెలుగు మార్క్ డైలాగులు ఇందులో చాలా వినిపించాయి. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ‘కుమారీ ఆంటీ’ ప్రస్తావన ఈ ట్రైలర్‌లోని కొసమెరుపు. ‘ఆర్.ఆర్.ఆర్‌లో’ని డైలాగుల్నీ వాడారు.
ట్రైలర్ యూత్ ఫుల్ గా ఉంది. కుర్రాళ్లకు బాగా నచ్చొచ్చు. మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా కాబట్టి, తెలుగులో మినిమం గ్యారెంటీ ఉంటుంది. పైగా ప్రేమ కథలకు నేటివిటీతో పనిలేదు. అన్నింటికి మించి ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఐటీ నేపథ్యంలో సాగే కథ ఇది. కాబట్టి.. ఇంకా బాగా కనెక్ట్ అవ్వొచ్చు. ఈమధ్య తెలుగులో వచ్చి హిట్టయిన ’90స్’ వెబ్ సిరీస్ అందించిన ఆదిత్య హాసన్ తెలుగు వెర్షన్‌కి సంభాషణలు అందించడం విశేషం. గతేడాది తమిళ సూపర్ హిట్ సినిమా ‘లవ్ టుడే’ తెలుగులో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ‘ప్రేమలు’ కూడా అదే మ్యాజిక్ చేసే ఛాన్సుంది.