ఇది వరకు పెద్ద సినిమాలకు ప్రీమియర్ షోలు ఉండేవి. భారీ అభిమాన ఘనం వుండే స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలకు సహజంగానే డిమాండ్ వుంటుంది. టికెట్లు కూడా ఎక్కువ ధరకే వెళ్తాయి. ఐతే ఇప్పుడు చిన్న సినిమాలకి కూడా స్పెషల్ షోల ట్రెండ్ మొదలైయింది. పెద్ద సినిమాల షోలు ఏవో కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్ వేస్తుంటారు. ఇప్పుడు చిన్న సినిమాల విషయానికి వస్తే దాదాపు అన్ని చోట్ల ప్రిమియర్లు వేస్తున్నారు. దీని వలన నిర్మాతలకు ఒక విధంగా మేలు జరుగుతుందనే అభిప్రాయం వుంది. పెద్ద సినిమాలతో పోల్చుకుంటే చిన్న సినిమాల టికెట్ ధర తక్కువే. ప్రేక్షకులకు ఈ రేటు భారం కాదు. తమ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఇటీవల కాలంలో శ్రీవిష్ణు సామజవరగమన సినిమా ప్రిమియర్ బజ్ తో మంచి లాభం పొందింది. సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే షోలు వేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా పక్కన పెట్టిమరీ ప్రిమియర్స్ పై ద్రుష్టి పెట్టారు. ఇది ఆ సినిమాకి బాగా కలిసొచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్ అంతటా వ్యాపించింది. ఈ టాక్ తో ఓపెనింగ్ డే లో థియేటర్స్ కళకళలాడాయి. వారు ఊహించిన దానికంటే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బేబీ కూడా ఇలానే ప్రీమియర్ షో లతో లాభం పొందింది.
ఐతే ఇందులో మైనస్సు లు కూడా వున్నాయి. చిన్న సినిమాని ముందు రోజే చుడాలన్న కుతూహలం అందరిలో వుండకపోవచ్చు. పైగా టాక్ తేడా కొడితే మొదటికే మోసం వస్తుంది. నాగశౌర్య రంగబలి సినిమా దీనికి ఊదాహరణ. ఫస్ట్ హాఫ్ బావుంది కానీ సెకండ్ హాఫ్ లో ఏమీ లేదనే టాక్ విడుదలకు ముందే బయటికి వచ్చేయడంతో రావాల్సిన ఓపెనింగ్స్ పై దెబ్బపడింది.
ఐతే చిన్న సినిమాలకు ఇది మంచి పరిణామం. ఏ మాత్రం బజ్ వున్నా ఒకరోజు ముందు రిలీజ్ చేసుకొని మౌత్ టాక్ తో ఓపెనింగ్స్ పెంచుకోవానికి మంచి అవకాశం దొరుకుతుంది.