భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 సం.లు అయింది. కానీ ఇన్ని దశాబ్దాల సుదీర్ఘకాలంలో ఆశించినంత అభివృద్ధి జరుగలేదనే చెప్పాలి. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ప్రభుత్వ పనితీరులో చాలా వేగం పెరిగింది. ఇంతవరకు కనీవినీ ఎరుగని విధంగా చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. వాటిలో తప్పకుండా చెప్పుకోవలసింది ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ రైల్ ఏర్పాటు. ఆ రెండు నగరాల మధ్య 505కి.మీ దూరం ఉంది. ఆ దూరాన్ని అధిగమించడానికి మన ఎక్స్ ప్రెస్ రైళ్ళకి సుమారు ఏడు గంటల సమయం పడుతుంది. కానీ గంటకు 300-350 కి.మీ. వేగంతో నడిచే బులెట్ రైళ్ళు ఆ దూరాన్ని కేవలం రెండు గంటల కంటే తక్కువ సమయంలోనే కవర్ చేయగలవు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ఇంటర్నేషనల్ కార్పోరేషన్ సంస్థ ముందుకు వచ్చింది. దానికి అవసరమయిన రూ.90,000 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు కూడా అంగీకరించింది. ఈ బులెట్ రైల్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు సమగ్ర సాంకేతిక నివేదిక తయారుచేసి జపాన్ సంస్థకు అందజేశారు. భారత్-జపాన్ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకి అవసరమయిన లాంచనాలు అన్నీ పూర్తి చేయగానే నిర్మాణ కార్యక్రమాలు మొదలవవచ్చును.