రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్థానికత ఫైల్ పై ఈరోజు సంతకం చేశారు. హైదరాబాద్ లో స్థిరపడిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు విజయవాడ తరలి వచ్చినప్పుడు వారికి, వారి పిల్లలకి స్థానికత హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జూన్ 2, 2017లోగా ఆంధ్రప్రదేశ్ తరలివచ్చే వారందరినీ స్థానికులుగానే పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి చట్ట బద్దత కల్పించేందుకు వీలుగా ఆర్టికల్ 371 (డి)లో చట్ట సవరణ చేయాలని అభ్యర్ధిస్తూ గత ఏడాది అక్టోబరులో కేంద్రానికి ఒకలేఖ వ్రాసింది. దానిని పరిశీలించిన తరువాత కేంద్రప్రభుత్వం అంగీకరించి రాష్ట్రపతి ఆమోదానికి పంపగా ఆయన కూడా దానికి ఈరోజు ఆమోదముద్ర వేశారు. కనుక హైదరాబాద్ నుంచి ఉద్యోగులు తరలిరావడానికి ఇంక ఈవిషయంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ దీనిపై తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం.
దానికి ఆమోదం తెలిపే ముందు తెలంగాణా ప్రభుత్వానికి ఆ విషయం తెలియజేసి దానిపై ఏమైనా అభ్యంతఃరాలు ఉన్నాయా? అని కేంద్రం అడిగినప్పుడు, ఆ ముసాయిదా కాపీని తమకు పంపినట్లయితే దానిని పరిశీలించి తమ అభిప్రాయం తెలియజేస్తామని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి తెలిపారు. ఇది జరిగి రెండు రోజులు కూడా కాలేదు. ఇంతలోనే స్థానికత ఫైల్ పై రాష్ట్రపతి సంతకం చేశారు. అంటే తెలంగాణా ప్రభుత్వం అభిప్రాయాలు, సూచనలు తీసుకోకుండానే ఆమోదముద్ర వేశారా లేకపోతే తెలంగాణా ప్రభుత్వం కూడా అంగీకరించినందుకే ఆమోదముద్ర వేశారా అనే విషయం తెలియవలసి ఉంది. ఏమైనప్పటికీ దీని వలన హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలి రావడానికి ఒక ప్రధాన అవరోధం తొలగిపోయింది.