రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ధాంగి శ్రీమతి శుబ్రా ముఖర్జీ ఈరోజు ఉదయం ఢిల్లీలో కన్నుమూసారు. ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి బాధపడుతున్నారు. ఢిల్లీలో మిలిటరీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 10.51 గంటలకి మరణించారు. ఆమె 1940, సెప్టెంబర్ 17న బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న జెస్సోర్ అనే గ్రామంలో జన్మించారు. 1957, జూలై 13న ఆమెకు ప్రణబ్ ముఖర్జీతో వివాహం జరిగింది. ఆమె మంచి రచయిత. సంగీతం, చిత్రలేఖనంలో మంచి గుర్తింపు పొందారు. స్వయంగా అనేక పెయింటింగ్ ఎగ్జిబిషన్లు నిర్వహించేవారు. ఆమె గీతాంజలి ట్రూప్ పేరుతో ఒక సంగీత బృందాన్ని సమకూర్చుకొని అనేక సంగీత కచేరీలు కూడా ఇచ్చారు. ఆమె వ్రాసిన ‘చకోర్ అలోయ్’ మరియు ‘చెన అచెనై చిన్’ అనే రెండు పుస్తకాలు మంచి పేరు, రచయిత్రిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
ప్రణబ్ దంపతులకు శర్మిష్ఠ అనే ఒక కుమార్తె అభిజిత్,ఇంద్రజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో శర్మిష్ఠ ప్రముఖ కథక్ నృత్యకారిణిగా అందరికీ చిరపరిచితులు. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. ఇటీవల డిల్లీ ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసారు కాని ఓడిపోయారు. అభిజిత్ తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన జంగీ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు.