మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాత్రి ఎనిమిదిన్నర వరకూ ఎన్సీపీకి గడువు ఇచ్చిన గవర్నర్…అంత వరకూ వేచిచూడలేదు. మధ్యాహ్నమే… గవర్నర్.. తన సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపారు. వెంటనే కేంద్రమంత్రివర్గం.. గవర్నర్ సిఫార్సుకు ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా…వెంటనే ఆ సిఫార్సుకు ఆమోద ముద్ర వేస్తూ.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ – శివసేన కూటమిగా పోటీ చేసి మెజార్టీ సీట్లు సాధించాయి. బీజేపీకి 105, శివసేనకు 56సీట్లు వచ్చాయి. అయితే శివసేన తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది.దానికి బీజేపీ హైకమాండ్ అంగీకరించలేదు.
కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది కానీ…సమయం సరిపోలేదు.. ఇరవై నాలుగు గంటల సమయమే శివసేనకు ఇచ్చిన గవర్నర్….మరికొంత సమయం ఇవ్వడానికి నిరాకరించారు. ఎన్సీపీకి సమయం ఇచ్చి..ఆ సమయం ముగియక ముందే రాష్ట్రపతి పాలన విధించేశారు. గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. కనీసం.. ఎన్సీపీకి ఇచ్చిన గడువు వరకైనా..గవర్నర్ ఎందుకు ఎదురుచూడలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు.. శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గవర్నర్ తమకు మరికొంత సమయం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని శివసేన వాదిస్తోంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపైనా శివసేన మరో పిటిషన్ ను కోర్టులో వేయనుంది.
కోర్టులో పిటిషన్లు… వాదనలు ఇవన్నీ.. సెకండరీ.. ఇప్పటికైతే.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ప్రారంభమయింది. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం.. అదీ కూడా మిత్రపక్షంతో మెజార్టీ సాధించినప్పటికీ.. విఫలమవడం… ఇదే మొదటి సారి. అయినప్పటికీ.. ఇతరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయడంలో.. మాత్రం విజయం సాధించింది.