దేశంలో మరోసారి ప్రజాస్వామ్యం శాస్త్ర ప్రకారం హత్య చేయబడింది. దేశంలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చి వేస్తున్న కేంద్రప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసిన తరువాత నిన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి హరీష్ రావత్ ప్రభుత్వాన్ని కూడా అధికారంలో నుంచి దిగ్విజయంగా తొలగించివేసింది. రాష్ట్రంలో తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి లేఖ వ్రాయడం, దానిపై కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా చర్చించి, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం, మరో ఆలోచన లేకుండా దానిని రాష్ట్రపతి వెంటనే ఆమోదించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
రాష్ట్ర శాసనసభలో మార్చి 18న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ తరువాత ప్రతిపక్ష భాజపా సభ్యులతో కలిసి అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే విజయ్ బహుగుణ నేతృత్వంలో9 మంది ఎమ్మెల్యేలు దానిపై డివిజన్ (ఓటింగ్) కి పట్టుబట్టారు. కానీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్ వాల్ వారి అభ్యర్ధనను తిరస్కరించి, మూజువాణి ఓటుతో దానికి సభ ఆమోదముద్ర వేసినట్లు ప్రకటించారు. దానితో కాంగ్రెస్ తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 9 మంది భాజపా సభ్యులతో గవర్నర్ ని కలిసి పిర్యాదు చేయడం, ఆయన వెంటనే స్పందించి ఈనెల 28న అంటే ఇవ్వాళ్ళ శాసనసభ లో బలం నిరూపించుకోవలసింధిగా హరీష్ రావత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అందుకు హరీస్ రావత్ అంగీకరించారు కూడా. ఈలోగా మిగిలిన వారిలో మరో 19 మంది ఎమ్మెల్యేలను కూడా ప్రలోభపెట్టడానికి భాజపా, బహుగుణ వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో, హరీష్ రావత్ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలని వారి భారి నుంచి కాపాడుకోవడానికి నైనీతాల్ జిల్లాలోని పులుల అభయారణ్యంలో వారిని దాచి పెట్టవలసి వచ్చింది. ఇవ్వాళ్ళ శాసనసభలో తన బలం నిరూపించుకోవడానికి హరీష్ రావత్ సిద్దం అవుతుండగా, నిన్న సాయంత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం తన చేతిలో ఉన్న ఆర్టికల్ 356 అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి చేతులు దులుపుకొంది.
దీనిపై ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్పందిస్తూ “మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మరోసారి హత్య చేసింది. కాంగ్రెస్ పాలిత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తరువాత, అన్యాయంగా నా ప్రభుత్వాన్ని రద్దు చేసింది. దేశ చరిత్రలో అధికారంలో ఒక ప్రభుత్వాన్ని శాసనసభలో బలం నిరూపించుకోమనడం, మళ్ళీ అందుకు అవకాశం ఇవ్వకుండానే హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించడం ఇదే మొదటిసారి. నా ప్రభుత్వానికి శాసనసభలో బలం ఉందని కేంద్రప్రభుత్వానికి తెలుసు. అందుకే అది నిరూపించుకొనే అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మోడీ ప్రభుత్వం ఇటువంటి అప్రజాస్వామిక విధానాల ద్వారా భాజపాని అధికారంలోకి తేవాలనుకోవడం చాలా శోచనీయం,” అని అన్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించగానే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ “హరీష్ రావత్ ప్రభుత్వం పదేపదే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో ఓటింగ్ జరగాలని సభలో ఉన్నవారిలో సగం మందికి పైగా సభ్యులు పట్టుబడుతున్నా వారి మాటను ఖాతరు చేయకుండా మూజువాణి ఓటుతో దానిని ఆమోదింపజేసుకొని మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడింది. తప్పనిసరి పరిస్థితులలో గవర్నర్ సిఫార్సు మేరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవలసి వచ్చింది,” అని అన్నారు.