లంగాణాలో తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల కారణంగా ఎవిధమగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందో మళ్ళీ ఇప్పుడు మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్య, న్యాయవాదుల ఆందోళనలు, హైదరాబాద్ లో ఐసిస్ ఉగ్రవాదుల కలకలం వంటి అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో అదేవిధంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో వరుస విజయాలతో దూసుకుపోతూ, ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసిన ఉత్సాహంతో రాష్ట్రంలో ఇక తనకి తిరుగేలేదని భావిస్తున్న సమయంలో తెరాస ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి రావడం విచిత్రంగానే ఉంది. ఇవన్నీ తెరాస కూడా ప్రజస్వామ్యానికి అతీతం కాదని, తెరాస అయినా మరే పార్టీ అయినా కూడా ఆ చట్రంలో ఒదిగే పనిచేయవలసి ఉంటుందని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా రైతన్నలు దోపిడీకి గురైయ్యారని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు పదేపదే చెపుతుంటారు. కానీ ఇప్పుడు తెరాస చేతిలోనే రైతులు దోపిడీకి గురవుతున్నారని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవి రాజకీయ దుర్దేశ్యంతోనే ప్రభుత్వంపై అటువంటి విమర్శలు చేస్తూ, ప్రజలని రెచ్చగొడుతున్నాయని, అభివృద్ధికి అడ్డు తగులుతున్నాయని తెరాస ప్రభుత్వం వాదిస్తోంది. దాని వాదనలు నిజమే కావచ్చు. అది ప్రతిపక్షలని నిర్వీర్యం చేస్తోంది కనుక ప్రతిపక్షాలు తమ మనుగడ కాపాడుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ బలపడాలని ప్రయత్నిస్తుండవచ్చు. కానీ అవి ఆవిధంగా పోరాడవలసిన పరిస్థితి కల్పించిది తెరాసయే కదా?
ఒకవేళ అవి నిర్వాసితుల సమస్యపై రాజకీయాలు చేస్తున్నాయని అనుకొన్నా, రాజకీయాలతో సంబంధం లేని తెలంగాణా రాజకీయ జేయేసి, ప్రజా సంఘాలు, చివరికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.రవికుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం వంటివారు కూడా తెరాస ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? నిర్వాసితులకి అన్యాయం జరుగుతోందని ఎందుకు భావిస్తున్నారు? వారికి అండగా నిలబడి పోరాడేందుకు ఎందుకు ముందుకు వస్తున్నారు? అనే ప్రశ్నలకు తెరాస ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం చెప్పగలిగితే ఎవరూ దానిని వేలెత్తి చూపలేరు.
తెలంగాణా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ తాత్కాలికమైనవే కావచ్చు. కానీ ‘రాష్ట్రంలో తనకు ఎదురు ఉండకూడదు…ప్రశ్నించేవారే ఉండకూడదు’ అనే తెరాస అప్రజాస్వామ్య ఆలోచనలకి, ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యవ్యవస్థలో సాధ్యం కావని నిరూపిస్తున్నట్లుగా దానికి ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళని అది కనువిప్పుగా భావించడం చాలా మంచిది.