తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ఇక తన వల్ల కాదని చెప్పేశారు. సీనియర్ నేతల రాజకీయాలను తాను తట్టుకోలేనని హైకమాండ్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుండి ఠాగూర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్లు ఆయనపై చాలా నిందలేశారు. డబ్బులు తీసుకుని పదవి వచ్చేలా చేశారన్నారు. అయితే మాణిగం ఠాగూర్ మాత్రం పార్టీ అంతర్గత విషయాలపై ఎప్పుడూ బయట మాట్లాడలేదు.
కానీ ఇటీవల కొంత మంది సీనియర్లు.. తెలంగా ణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కన్నా.., భారత రాష్ట్ర సమితితో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయాన్ని మాణిగం ఠాగూర్ వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్తో వెళ్లడం అంటే.. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దని ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా సీనియర్లకు తెగేసి చెప్పినట్లుగా చెబుతున్నారు.
సీనియర్లు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే వారిపై ముందుగానే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అందుకే దిగ్విజయ్ సింగ్ ను పంపి.. సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే తాము టీ పీసీసీ నిర్వహించే కార్యక్రమాలను వెళ్లబోమని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వవొద్దని ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకునేలా చాన్స్ ఇస్తే చాలని సీనియర్లు అంటున్నారు. ఇక కీలక నిర్ణయం తీసుకోవాల్సింది రాహుల్ గాందీనేనని అంటున్నారు.