హైదరాబాద్‌లో వాటర్ బాడీస్ ఆక్రమణల పేరుతో ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెట్టిన ప్రెస్మీట్లో ప్రకటించిన వివరాలతో బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. మొత్తంగా 11 బడా ప్రాజెక్టులు వాటర్ బాడీస్ ఆక్రమించుకున్నాయని పరోక్షంగా భట్టి విక్రమార్క వెల్లడించారు. వీటి విలువ పదిహేను వేల కోట్ల వరకూ ఉంటుంది. వీటిని కూల్చివేస్తారని ఎవరూ అనుకోవడం లేదు కానీ… పూర్తిగా హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఉన్నప్రాజెక్టులపై హడావుడిగా ఈ కబ్జా ముద్ర ఎందుకు వేయాల్సి వచ్చిందన్నది రియల్ఎస్టేట వర్గాలకూ అంతు చిక్కడం లేదు.
ఈ బడా ప్రాజెక్టులన్నీ బ్యాంకుల రుణాలతోనే నడుస్తాయి. అన్ని రకాల అనుమతులు , రెరా గ్రీన్ సిగ్నల్ ఉండటంతో బ్యాంకులు సైతం సులభంగా రుణాలు ఇస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వమే ఆక్రమణ నిర్మాణాలుగా తేల్చడంతో బ్యాంకులు ఇప్పటి వరకూ మంజూరు చేసిన రుణం క్లియర్ చేయాలని ఇక ముందు రుణం కోసం ఒత్తిడి చేయవద్దన్నట్లుగా సంకేతాలు పంపుతున్నాయి. ప్రభుత్వం ఆక్రమణలుగా ప్రకటించిన తర్వాత బ్యాంకులు రుణాలుఇచ్చే పరిస్థితి ఉండదు.
అదే సమయంలో కొనుగోలు చేసిన వారు కూడా వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హైరైజ్ భవనాల నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే నిర్మాణ సంస్థలు ప్లాట్ల అమ్మకాలు చేపడుతుంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్, నా ర్సింగి, పుప్పాలగూడ, సైబర్‌సిటీ, నెక్నాంపూర్ వంటి ప్రైమ్ ఏరియాల్లో భవనాలు కావడంతో ఆ వెంచర్లలో భారీ సంఖ్యలో ప్లాట్లు బుక్ అయ్యాయి. ఒక్కో ప్లాట్‌కు రూ.కోట్లు చెల్లించి బుక్ చేసుకున్నారు. వారిలో చాలా మంది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం నుంచి తమ ప్రాజెక్టులపై క్లారిటీ రాకపోతే వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. పరిష్కారం కోసం ప్రయత్నాల్లో బడా రియల్టర్లు ఉన్నారు.