రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇంట్లో కాక పుట్టిస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు రెండే స్థానాలు ఉండడంతో సహజంగానే పోటీ పెరిగింది. ఇందులో ఒక స్ధానాన్ని కళాకారుడికి కాని, మేథావి కాని ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఆశావహులు మాత్రం ఎక్కువగానే ఉన్నారంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ డిమాండ్ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇంటి నుంచే ప్రారంభమైనట్లు చెబుతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితను రాజ్యసభకు పంపంచాల్సిందేనంటూ ఇంటి పోరు ఎక్కువైందని అంటున్నారు.
అయితే కేసీఆర్ మాత్రం ఇందుకు సుముఖంగా లేరని, ఇప్పటికే అన్ని పదవులు సీఎం ఇంటికే పరిమితం అయ్యాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవితను రాజ్యసభకు కూడా పంపిండం మరిన్ని విమర్శలకు దారి తీస్తుందని కేసీఆర్ అంటున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందే కేసీఆర్ కుమారుడు కే.తారక రామారావుకు కార్యనిర్వాహక అధ్యక్షడి పదవి ఇవ్వడంపై కూడా కవిత ఇంట్లో నిరసన వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. ఆ పదవి తనకు ఇవ్వాలని, దీని ద్వారా మహిళలకు పార్టీలో సముచిత స్ధానం ఇచ్చినట్లుగా ఉంటుందని కవిత ఆనాడే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పదవి ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించడంతో కవిత అలిగారని, ఆ సమయంలో తల్లి జోక్యం చేసుకుని భవిష్యత్ లో మంచి పదవి వచ్చేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఆ హామీలో భాగంగా కవితను రాజ్యసభకు పంపాలన్నది ఇంటి హోం మంత్రి డిమాండ్ గా చెబుతున్నారు. గత కొంతకాలంగా కవితను రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ ఇంట్లో రోజురోజుకు పెరుగుతోందని, అయితే సీఎం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. తన సోదరి కవితకు రాజ్యసభ టిక్కట్ ఇవ్వడంపై ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కూడా ఇష్టం లేదని, రాజ్యసభ కాకుండా మరో పదవి ఏదైనా ఇవ్వాలన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. రెండు రాజ్యసభ పదవుల్లో ఒకటి బీసీకాని, దళిత వర్గానికి కాని ఇవ్వాలన్నది ఆయన ప్రతిపాదనగా చెబుతున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కవిత అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూండడంతో సీఎం ఇంట్లో ఈ అంశంపై రగడ జరుగుతోందని అంటున్నారు. మొత్తానికి రాజ్యసభ స్ధానం సీఎం ఇంట్లో లొల్లి లొల్లి చేస్తోందంటున్నారు.