ముద్రగడ పద్మనాభం ఇంటికి ప్రతీ వారాంతంలో లేదా.. అప్పుడప్పుడూ కొంత మంది కుల సంఘాల నేతలు వస్తున్నారు. అయితే వారు కాపు కులసంఘాల నేతలు కాదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ కుల సంఘాలమని చెప్పుకుంటున్న నేతలు వస్తున్నారు. అలా వచ్చే వారంతా.. ఆయనను కొత్త పార్టీ పెట్టాలని ప్రోత్సహిస్తున్నారు. మీరు పార్టీ పెడితే మీ వెంటే మీముంటామని ఆఫర్ ఇస్తున్నారు. ఇది ఒక్క రోజుగా జరుగుతున్నపని కాదు.. గత రెండు మూడు నెలలుగా ఈ ప్రక్రియ సాగుతోంది. దీంతో ముద్రగడ రాజకీయ ఆలోచనలు దూకుడుగా ఉన్నాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్ల గురించి రచ్చ చేసి… తర్వాత వైసీపీ సర్కార్ వచ్చి ఆ రిజర్వేషన్లు తీసేసినా నోరు మెదపడం లేదని ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీటిని భరించలేకపోతున్నానని అందుకే కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటం నుంచి వైదొలుగుతున్నానని ఆయన ప్రకటించుకున్నారు. అప్పట్నుంచి కాపుల గురించి… రిజర్వేషన్ల గురించి ఎలాంటి మాటలూ మాట్లాడటం లేదు. కానీ కోడి పందెల గురించి జగన్‌కు.., మరో జాతీయ సమస్య గురించి మోడీకి తెలుగులో లేఖలు రాస్తూ మీడియాకు విడుదల చేస్తూంటారు.
ఆయన రాజకీయంగా ప్రభావం చూపించగలరని ఎవరూ అనుకోవడం లేదు. ఆయన స్వయంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మంచి రేజ్‌లో ఉన్నప్పుడు పది వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు సొంత పార్టీ అని తెర ముందుకు వస్తే సొంత వర్గం అయినా ఎలా నమ్ముతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఓ వ్యూహం ప్రకారం… ఎస్సీ, ఎస్టీ, బీసీల పేరుతో పార్టీ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.