ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే, ఆలస్యం చేస్తున్న కొద్దీ అమృతమైనా విషం అవుతుందని అర్థం. ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరిగిపోవాలి. లేదంటే… ఇదిగో ఇలా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ మాదిరిగానే సమీకరణాలు మారిపోతాయి! గడచిన దసరా పండుగ నాడు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని చాలామంది ఆశావహులు ఎదురుచూశారు. అక్కడి నుంచి విస్తరణ వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ అనే టాపిక్ చంద్రబాబుకు గుర్తుందో లేదో అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. అయితే, పదవుల కోసం ఎదురుచూసిన నేతలు, ఇన్నాళ్లూ దాచుకున్న అసంతృప్తిని మెల్లగా బయటపెడుతున్న తరుణమిది.
వైకాపా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవులు దక్కుతాయన్న ఒకే ఒక్క ఆశతో వారిలో చాలామంది గోడ దూకేశారు. అంతేకాదు, ఎవరెవరికి ఏయే శాఖలు దక్కుతాయన్నది కూడా ఓ రేంజిలో ప్రచారం జరిగిపోయింది! అంటే, వారు ఏ రేంజిలో ఆశలు పెట్టుకుని ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారితోపాటు, తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా విస్తరణలో పదవులు ఆశించినవారు ఉన్నారు. ఇప్పుడు వీరి అసంతృప్తే కాస్త ఎక్కువగా వినిపిస్తోంది! ఫిరాయింపుదారుల వల్లనే తమకు పదవులు దక్కడం ఆలస్యమైందనే కడుపుమంటను కొంతమంది తాజాగా బయటపెడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే, మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణం ఫిరాయింపులే కదా!
తెలంగాణకు చెందిన జంప్ జిలానీల అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. దీనిపై వచ్చే తీర్పు సహజంగానే ఏపీకి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ఇప్పుడు జంప్ జిలానీలకు పదవులు ఇస్తే కష్టమైపోతోందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. సో… ఆ రకంగా కొంతమంది తెలుగుదేశం నేతలు కూడా పదవుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో సొంత పార్టీకి చెందిన ఆశావహుల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. అలాగే, జంప్ జిలానీలు కూడా కాస్త అసంతృప్తితోనే ఉన్నారట. పార్టీలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా తమకు ప్రాధాన్యత దక్కకపోవడంతో వారు కూడా చంద్రబాబు తీరుపైనే ఆఫ్ ద రికార్డ్ మండిపడుతున్నారట.
మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడంతో చంద్రబాబుపై ఇలా రెండు విధాలుగా ఒత్తిడి పెరుగుతోందని అనుకుంటున్నారు. తమకు అన్యాయం చేస్తున్నారని సొంత పార్టీ నేతలు అంటున్నారట. తమ పరిస్థితి ఏంటంటూ ఫిరాయింపుదారులు కూడా చంద్రబాబు వైపు చూస్తున్నారట. సో… మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడంతో మారిన సమీకరణాలు ఇలా ఉన్నాయన్నని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.