సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో తొలిదశ విచారణలు ముగిశాయి. నటుడు నందు విచారణతో సినీ పరిశ్రమకు చెందిన 12 మంది విచారణ పూర్తయింది. నందుని కేవలం మూడు గంటల సేపు మాత్రమే సిట్ అధికారులు ప్రశ్నించారు. వీరి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టామని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టీ రెండో జాబితాపైనే ఉంది. ఈ జాబితాలో మరికొంతమంది సినీ ప్రముఖులతోపాటు, రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన పుత్రరత్నాలు కూడా ఉన్నారనే ఊహాగానాలు ఈ మధ్య జోరుగా వినిపించాయి. రెండో జాబితా కూడా తయారైందనీ, నోటీసులు జారీ కావడమే తరువాయి అన్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి. దీంతో డ్రగ్స్ కేసులో రెండో అధ్యాయం ఎప్పుడు మొదలౌతుందని అనేది ఆసక్తికరంగా మారింది.
జులై 19న దర్శకుడు పూరీ జగన్నాథ్ తో ఈ కేసు విచారణ మొదలైంది. అక్కడి నుంచి వరుసగా రోజుకో సినీ ప్రముఖుడుని సిట్ అధికారులు ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, వీరితోపాటు మరికొంతమంది పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. వారంతా రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, వీళ్ల పేర్లను బయటకి రాకుండా చేయాలంటూ కొంతమంది ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు పెరుగుతున్నట్టు సమాచారం! విశ్వసనీయ సమాచారం ప్రకారం… రెండో జాబితాలో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పెద్ద తలకాయలే ఉన్నాయనీ, వారి పేర్లను బయటకి తేవొద్దంటూ కొంతమంది ‘పెద్దలు’ అధికారులకు సలహాలు ఇస్తున్నట్టు చెబుతున్నారు! అంతేకాదు, రెండో జాబితాను బయటపెట్టకుండా రహస్యంగా విచారణ జరిగే వీలుంటే పరిశీలించాలనే సూచనలు కూడా ఉన్నతాధికారులకు అందుతున్నట్టు ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది.
డ్రగ్స్ తీసుకున్నవారంతా బాధితులు మాత్రమేననీ, నేరస్థులు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తరువాత పరిస్థితి మారిపోయిందని చెప్పొచ్చు! మొదటి జాబితాలో రవితేజ విచారణ వరకు చాలా హడావుడి కనిపించింది. ఆ తరువాత, ఇదేదో సాధారణ వ్యవహారంగా మారిపోయింది. దీంతో తొలి దశలో 12 మంది విచారణ తరువాత, ఇప్పుడు సిట్ ఏం చేయబోతోందన్నది చర్చనీయంగా మారింది. కొన్ని మీడియా వర్గాల్లో అయితే.. డ్రగ్స్ కేసులో రెండో జాబితా ఉంటుందా అంటూ అనుమానాస్పదంగా కథనాలు వచ్చేస్తున్నాయి. డ్రగ్స్ కేసులో హడావుడే తప్ప, అధికారులు సాధించింది ఏమీ లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు రెండో జాబితా విషయంలో కూడా సిట్ ఇదే జోరును కొనసాగిస్తుందా..? పుకార్లు షికారు చేస్తున్నట్టుగా ఒత్తిళ్లకు లొంగి, రెండో జాబితాలో వారిని రహస్యంగా విచారణకు పిలుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రెండో జాబితాలో వారిని రహస్యంగా విచారణ చేస్తే, మరిన్ని విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది.