పిల్లలంటే మార్కులు సాధించే యంత్రాలని టీచర్లు, తల్లిదండ్రులు భావించిన పాపం ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయికృష్ణ జీవితం పదహారేళ్లకే ముగిసిపోయింది. ఐఐటీ చదవాలనే తల్లిదండ్రుల కోరిక, తన లక్ష్యం కారణంగా హైదరాబాదులో చదువుతున్న ఈ విద్యార్థి, ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన సాయికృష్ణ, హైదరాబాదులోలని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న శ్రీ గాయత్రి అకాడమీ ఐఐటీ కోచింగ్ క్యాంపస్ లో చేరాడు. హాస్టల్లో ఉంటున్నాడు. లెక్కల్లో వంద శాతం మార్కులు పొందుతున్నాడు. మిగతా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడంతో అతడిని వీక్ స్టూడెంట్ అని టీచర్స్ పరిగణించారు. అతడి డైరీలో ఉన్న విషయం ఇదే. తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్నా, ఇక్కడ జరుగుతున్నది చూసి అతడికి ఏమీ అర్థం కాలేదు. బట్లీ చదువులే తప్ప, నిజంగా తెలివిని పెంచే ప్రయత్నం జరగక పోవడం అతడికి పజిల్ లా అనిపించి ఉంటుంది. అసలు ఈ కాలేజీల్లో స్పార్క్ గ్రూప్, స్టార్ గ్రూప్, వీక్ గ్రూపులనే తేడాలేంటి? స్వతహాగా తెలివైన వారిని ఓ గ్రూపులో చేర్చి వారిమీదే దృష్టి పెట్టడం, మిగతా విద్యార్థులను పెద్దగా పట్టించుకోక పోవడం దాదాపు అన్ని కాలేజీల్లోనూ జరుగుతుంది. ఏశో ఒకటి రెండు కాలేజీలు ఇందుకు మినహాయింపు కావచ్చు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఐఐటీ మీద ఉన్న మోజును క్యాష్ చేసుకోవడానికి చాలా విద్యా సంస్థలు విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఏటా కోట్ల రూపాయలు దండుకొంటున్నాయి. తీరా ఫలితాలు చూస్తే వాటిలో చదివిన వారిలో పట్టుమని 5 శాతం మందికి కూడా ఐఐటీ సీటు రావడం లేదు. కానీ వచ్చిన వారి గురించి పత్రికలు, టీవీ యాడ్స్ లో భారీగా ప్రచారం చేస్తున్నారు. సాయికృష్ణ డైరీలో రాసుకున్న విషయాలు చూస్తే మనసున్న ప్రతి ఒక్కరికీ కళ్లు చెమరుస్తాయి. అసలు ఈ విద్యా వ్యవస్థే బాగా లేదని ఎంతో ఆవేదనగా రాశాడు. ఇక తాను ఈ లోకాన్ని వీడి పోవాలని భావిస్తున్నానని రాసేటప్పుడు అతడి లేత హృదయం ఎంతగా తల్లడిల్లి ఉంటుంది? నిజంగానే ఆత్మహత్యకు పాల్పడే సమయంలో కన్న వారు గుర్తుకు వచ్చి ఎంత రోదించి ఉంటాడు? చదువంలే జీవితానికి ఓ చుక్కాని. చదువు ముఖ్యం. చదువే ముఖ్యం కాదు. బిల్ గేట్స్, సచిన్ టెండుల్కర్ వంటి వారు చదువులో వెనకబడినంత మాత్రాన పనికి మాలిన వారు కాదు. తల్లిదండ్రులు కూడా చదువు పేరుతో మానసికంగా హింసించి, గ్రూపుల వారీగా విద్యార్థుల పట్ల వివక్ష చూపే కాలేజీల్లో పిల్లలను చేర్పించక పోవడం మంచిది. ఐఐటీ కోసం ఒత్తిడి చేసి, అసలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రానివ్వడం మంచిదా? చదువులో కాకపోయినా మరో రంగంలో అయినా పిల్లలు రాణించేలా స్వేచ్ఛనివ్వడం మంచిదా? తల్లిదండ్రులు ఆలోచించాలి.