ఆంధ్రప్రదేశ్ కి నిన్న కేంద్రప్రభుత్వం రూ.1976 కోట్లు విడుదల చేసింది. సాధారణ పరిస్థితులలో అయితే అందుకు ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు అందరూ చాలా సంతోషించేవారు. కానీ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పి చివరికి అది కూడా ఇవ్వకుండా కేవలం రూ.1976 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడంతో అందరూ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆ వేడిసెగలని తెదేపా ప్రభుత్వమే భరించవలసి వస్తోంది. రాష్ట్ర భాజపా నేతలు ప్రజాగ్రహానికి భయపడి మీడియా కంటపడకుండా తప్పించుకొని తిరుగవలసి వస్తోంది.
ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తెదేపాకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల చేత తక్షణమే రాజీనామా చేయించాలని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలని గాలికొదిలి తన స్వార్ధ ప్రయోజనాలు మాత్రమే చూసుకొంటూ కేంద్రప్రభుత్వంతో అంటకాగుతున్నారని వైకాపా ఆరోపించింది. వాయిదాల పద్దతిలో కేంద్రప్రభుత్వం విదిలిస్తున్న ముష్టి మనకి అక్కరలేదని అందరూ కలిసి పోరాడి ప్రత్యేక హోదా, విభజన చట్టం పేర్కొన్న హామీలని అన్నిటినీ సాధించుకొందామని శ్రీనివాస్ అన్నారు.
ఈనెలాఖరులోగా ప్రత్యేక హోదాపై కూడా తుది నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక అంతవరకూ తెదేపా తన భవిష్యా కార్యాచరణ ఆలోచించుకోవడానికి సమయం ఉంటుంది. ఇదే విషయం గురించి మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పుడు ఆయన నిధుల విడుదల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ “ఈ పుష్కరాల సమయంలో నేను ఎన్డీయే రాజకీయాల గురించి మాట్లాడను,” అని సమాధానం చెప్పారు. అంటే ఈనెల 24న పుష్కరాలు ముగియగానే అంటే మరో 5రోజుల తరువాత భాజపాతో పొత్తుల గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు భావించవచ్చు.