తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఉద్యోగుల జీతాలను… గత నెల మాదిరిగానే సగం మాత్రమే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాయి. ఈ మేరకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. కానీ ఏపీ సీఎం మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 70 శాతం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. గత నెల యాభై శాతం మాత్రమే ఇచ్చారు. ఏపీలోనూ అంతే. అయితే.. ఈ సారి .. పెన్షన్లను మొత్తం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు రెండు రాష్ట్రాల్లోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఉద్యోగులు తమ జీవిత కాలం అంతా సర్వీస్ చేస్తే.. వస్తున్న పెన్షన్ అని..దాన్ని కత్తిరించడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.
రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ మేరకు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరుగుతోంది. ఏపీ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి.. ఏ చట్టం కింద సగం పెన్షన్ ను కట్ చేశారో చెప్పాలని.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఇరవై ఏడో తేదీన జరగనుంది. హైకోర్టు నిర్ణయాన్ని బట్టి ఏపీ సర్కార్.. ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఉద్యోగులకు మాత్రం గత నెలలానే జీతాలు ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ నెల జీతాల కోసం ఇరవయ్యో తేదీ నుంచి బిల్లులు రెడీ చేస్తారు. ఏపీ సర్కార్ లో ఇప్పటి వరకూ అలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు.
పెన్షనర్లకు.. ఎలాంటి కత్తిరింపులు ఉండవద్దని.. గతంలో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని గుర్తు చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రిటైర్డ్ ఉద్యోగులందరూ.. అరవై ఏళ్లు పైబడిన వారే ఉంటారని.. ఇలాంటి సమయంలో వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని.. అందు వల్ల వారి పెన్షన్ల విషయంలో కత్తిరింపులు వద్దని లేఖ రాశారు. సహజంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనే ఆధారం కాబట్టి.. ఈ డిమాండ్ సరైనదేనని.. అన్ని వర్గాల నుంచి స్పందన వస్తోంది. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.