వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత విచారణలో … నిజాలు కనుక్కోవడానికి పోలీసులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో .. వైఎస్ వివేకా కుమార్తె కూడా అదే స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నట్లుగా.. రోజు మార్చి రోజు.. ఆమె విడుదల చేస్తున్న వీడియోలు, పెడుతున్న ప్రెస్మీట్లతో తేలిపోతోంది. మరోసారి.. మీడియా ముందుకు వచ్చిన వివేకా కుమార్తె సునీతారెడ్డి పోలీసులు .. తమ కుటుంబసభ్యులనే నిందితులుగా చూపించబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాన్న హత్యకేసు విచారణలో అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె మరోసారి చెప్పుకొచ్చారు. నాన్న చనిపోయిన విషయం ఉదయం 6.40కి సమాచారం ఇచ్చాం. డెత్ స్పాట్లో ఏం జరిగిందో సీఐకి తెలుసు. పరమేశ్వరరెడ్డి వ్యవహారం అనుమానాస్పదంగా ఉందన్నారు.
వివేకా కుమార్తె.. ఇప్పటికి.. పలుమార్లు మీడియా ముందుకొచ్చి.. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత పులివెందులలో మీడియా ముందుకు వచ్చి… సిట్ విచారణపై నమ్మకం వ్యక్తం చేశారు. పోలీసులు అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. వారిని స్వేచ్చగా పని చేయనివ్వాలన్నారు. అయితే… ఇది అంతగా వర్కవుట్ కాలేదనుకున్నారో ఏమో కానీ.. తర్వాతి రోజు.. విజయవాడలో ఈసీని కలిశారు. సీబీఐ విచారణ కోరారు. సీఈవో మాత్రం తమకు అధికారం లేదని.. సీఈసీని కలవాలని సూచించారు. ఆ తర్వాతి రోజే… మళ్లీ సీఈసీని కలిశారు. కేంద్ర హోంశాఖను కలిశారు. అవేమీ వర్కవుట్ కాకపోవడంతో.. మళ్లీ సీన్ కడపకు మార్చారు. కడప నుంచి ఓ వీడియో ప్రకటనను రెండు రోజుల కిందట విడుదల చేశారు. అందులో సీఐ శంకరయ్యపై అనుమానం వ్యక్తం చేశారు. కడపలోని వైఎస్ జగన్ బంధువు జార్జిరెడ్డి ఇంట్లో.. ఆ వీడియోను రికార్డు చేశారు. దాన్ని హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం రిలీజ్ చేసింది. అందులోనూ కొన్ని ఎడిటింగ్లు ఉన్నాయి. ఈ వీడియో వర్కవుట్ కాలేదని.. మళ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో సీఐతో పాటు… మంత్రి ఆదినారాయణరెడ్డిపైనా ఆరోపణలు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నేతలందరితో నాన్నకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం ఆదినారాయణరెడ్డి వర్గానికి బాగా తెలుసు. ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అని సునీతారెడ్డి కొత్త కోణం ఆవిష్కరించారు.
అసలు కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. ఇప్పటికే మూడు పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. అవి విచారణలో ఉండగానే.. వైఎస్ కుటుంబీకులంతా టెన్షన్ పడిపోతున్నారు. సిట్ ఎక్కడ వివరాలు బయట పెట్టేస్తుందోనని.. కంగారు పడిపోతున్నారు. సిట్ వివరాలు బయట పెట్టవద్దని కోర్టుని కూడా కోరారు. ఈ మొత్తం కేసులో సునీతారెడ్డి మీడియా ముందుకు వస్తున్నారు. వచ్చిన ప్రతీ సారి ఆమె ఓ కొత్త వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన రోజున.. డ్రైవర్ పై అనుమానం కలిగే విధంగా ఓ లేఖ ఇచ్చారు. ఆ తర్వాత సీఐ శంకరయ్యపై… ఆ తర్వాత పరమేశ్వర్ రెడ్డిపై.. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డిపై.. ఇలా… వరుసగా.. ఆమె కొత్త కొత్త వ్యక్తుల్ని తెరపైకి తెస్తూనే పోతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో.. ఎవరు చేయిస్తున్నారో.. అనే కోణంలో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతోంది.