మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసిన దగ్గర్నుంచీ రాజధాని అమరావతి విషయమై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. వైకాపాతోపాటు భాజపా నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం సూచనలూ సలహాలూ ఉంటాయని విజయసాయిరెడ్డి చెబితే… మాకేం సంబంధం, అది స్టేజ్ సబ్జెక్ట్ అంటూ భాజపా ఎంపీ సుజనా చౌదరి అంటారు. రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలు అవసరమా అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటారు. అవంతి శ్రీనివాసరావు మరో మాట అంటారు! ఇలా ఎవరికివారు రాజధాని మీద తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. అయితే, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందనేంటి..? ఇక్కడ జరుగుతున్న చర్చ ఆయనకి తెలియదా..? ఆయనకి చెప్పకుండా రాజధాని అంశంపై బొత్స, ఆళ్ల, అవంతి, అంబటి లాంటి నేతలు మాట్లాడేస్తుంటారా..? ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.
అధికార పార్టీ నేతల్లో వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే… రాజధాని అమరావతిలో పెట్టడం వల్ల అక్కడ ఓ బలమైన సామాజిక వర్గం లాభపడిందనీ, చుట్టపక్కల పెద్ద ఎత్తున భూముల క్రయ విక్రయాలు వారే చేసుకున్నారనీ, మనం అధికారంలోకి ఇప్పుడొచ్చాం కాబట్టి… మన పరిస్థితి ఏంటనేది కొంతమంది ఒత్తిగా ఉందట! ఇదే విషయమై ఎన్నికల ముందు నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతల నుంచి ఒత్తిడి తెచ్చారనీ, అందుకే ఆ సమయంలో కూడా అమరావతి అంశమై ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నేరుగా వేదికల మీద ఎవ్వరూ మాట్లాడకపోయినా, ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఈ భావనను క్షేత్రస్థాయిలో వైకాపా క్రియేట్ చేసిందనీ ప్రచారం జరిగింది.
అధికారంలోకి వచ్చాక కూడా మళ్లీ అమరావతి ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకుంటూ పోతే… చంద్రబాబు హయాంలో ఏ సామాజిక వర్గానికైతే మేలు జరిగిందో, మళ్లీ వాళ్లకే లాభం చేకూర్చినట్టు అవుతుందనే ఒత్తిడి సీఎం మీద ఇప్పుడు ఉందని అధికార పార్టీలో ఓ చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా రెండు రాజధానులు ఉండేలా ఏదైనా ప్రతిపాదన తెరమీదికి తెస్తారా, తిరుపతి కేంద్రంగా ఆ అవకాశం ఉంటుందా అనే గుసగుసలు కూడా వైకాపా వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి ఈ అంశంపై వెంటనే స్పందించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.