తెలంగాణలో బీర్ల ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వలేదని కింగ్ ఫిషర్ బ్రాండ్ .. తెలంగాణ మార్కెట్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమయింది. చాలా కాలం నుంచి రేట్లు పెంచలేదని యూబీ కంపెనీ చెబుతోంది. అయితే కంపెనీల బ్లాక్ మెయిలింగ్ కు లొంగేది లేదని.. ధరలు పెంచేది లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఏపీ లో మాత్రం చాలా మద్యం కంపెనీలు స్వచ్చందంగా ధరలు తగ్గిస్తామని ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీలు మద్యం ధరలను తగ్గించాయి. తాజగా మరికొన్ని బ్రాండ్లు కూడా ప్రభుత్వం ముందు అవే ప్రతిపాదన పెట్టాయి. తమ అమ్మకాలు పెంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు 99 రూపాయల లిక్కర్ బాటిల్ ను తెచ్చింది. దీనికి ఎక్కువ ఆదరణ ఉంది. వైసీపీ హయాంలో చీప్ లిక్కర్ ను రూ. 250కిపైగా పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు తక్కువ ధరకు వస్తూండటంతో చాలా మంది ఈ మద్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చి డబ్బులు మిగుల్చుకుంటున్నారు.
ఇప్పుడు తమ కంపెనీల అమ్మకాలను పెంచుకోవడానికి ధరల తగ్గింపు వ్యూహాలను మద్యం కంపెనీలు పాటిస్తున్నాయి. పలు కంపెనీల ధరలు తగ్గనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసలు ఇలాంటి బ్రాండ్ల అమ్మకానికి అవకాశం ఇవ్వలేదు. కొన్నింటికి చాన్స్ ఇస్తే.. వాటి యాజమాన్యాల నుంచి భారీగా కమిషన్లు నొక్కేసవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి బాధలు లేకపోవడంతో రేట్లను తగ్గిస్తున్నారు.