తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీ పడి మరీ ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి. పక్క రాష్ట్రం కంటే తాము తక్కువే పెంచామంటూ.. తమది జాలి గుండె అని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్ చార్జీలు ముందుగా పెంచారు. అక్కడ కార్మికులు సమ్మె చేయడం.. రెండు నెలల తర్వాత కేసీఆర్ కరుణించడంతో.. వారు విధుల్లో చేరారు. కానీ.. ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. చార్జీల భారం మోపారు. వెంటనే.. ఏపీలో .. ఎలాంటి సమ్మెలు లేకపోయినా… భారీ నష్టాలొస్తున్నాయన్న కారణం చూపి.. చార్జీలను బాదేశాలు ఇదేమని అడిగితే.. తెలంగాణ కన్నా తక్కువే పెంచామని.. అసెంబ్లీలో కూడా ఎదురుదాడికి దిగింది అధికారపక్షం. చార్జీలు పెంచామని.. ప్రజలు బస్సులు ఎక్కడం మానేయరని.. వెటకారం కూడా.. అందులో ఉంది.
అంతకు ముందే.. కొత్త మద్యం విధానం పేరుతో ఏపీ సర్కార్.. ఓ రకంగా మందుబాబులను నిలువదోపిడీ చేయడం ప్రారంభించింది. మద్యం ధరలు దాదాపుగా రెట్టింపు చేసింది. ప్రజలు మద్యం తాగాలంటే.. భయపడేలా.. మద్యం ధరలు పెంచామని.. ఆదాయం కోసం కాదని.. ఏపీ సర్కార్ వాదిస్తోంది. ఇప్పుడు.. తెలంగాణ సర్కార్ కూడా.. ఏపీనే చూపిస్తూ.. మద్యం ధరలు పెంచేసింది. ఏపీ పెంచిన మద్యం ధరలనుఆసరా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచింది. అయితే వ్యూహాత్మకంగా ఏపీ కంటే కాస్త తక్కువగానే మద్యం ధరలు పెంచింది. ఏపీ లో ధరలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ నుండి మద్యం ఏపీ లో ప్రవహించే ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో తమ మద్యం అమ్మకాలు భారీగా పెంచుకోవాలనే ప్లాన్ వేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా మద్యం ధరల పెంపు వల్ల ఖజానాకు ఏటా నాలుగు వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఆర్టీసీ చార్జీలు పెంచినప్పుడు.. ఏపీ సర్కార్.. తెలంగాణ కన్నా ఎక్కువ పెంచలేదని గొప్పలు చెప్పుకుంది. మద్యం ధరలు పెంచిన తెలంగాణ సర్కార్.. ఏపీ కన్నా ఎక్కువ పెంచలేదని చెప్పుకుంది. ఈ రెండు రాష్ట్రాలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటూ.. పొరుగు రాష్ట్రం కన్నా.. తక్కువ స్థాయిలోనే వాతలు పెట్టామని ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ధరలు పెంచుతూ.. ప్రజల జీవన ప్రమాణాల్ని దిగజారుస్తున్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.