జనాభా పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. డిమాండ్ పెరుగుతోంది. కానీ పెట్రోల్, డీజిల్ , గ్యాస్‌లను మాత్రం కొనేవారు తగ్గిపోతున్నారు. ఈ విషయం కేంద్రమే వెల్లడించింది. గత నెలలో పది శాతం పెట్రోల్, పదిహేను శాతం డీజిల్ అమ్మకాలు తగ్గిపోయాయి. గ్యాస్ డిమాండ్ కూడా పడిపోయింది. సాధారణంగా డిమాండ్ తగ్గడం అంటూఉండదు. మరెందుకు తగ్గిపోయింది ? ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతూ వస్తోంది. ఈ కారణంగానే డిమాండ్ పడిపోతోంది. ధరలను ప్రభుత్వం అడ్డగోలుగా బాదేస్తోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 120 దాటి పోయింది.
ఇందులో పన్నూలే అరవై.. డెభ్బై రూపాయల వరకూ ఉంటాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోతే పెచుతున్నారు. కానీ తగ్గితే తగ్గించడం లేదు. కరోనా దెబ్బకు ప్రజల ఆర్థిక పరిసథితి తిరగబడింది. కొన్ని కోట్ల మంది మధ్య తరగతి నుంచి దిగువ మధ్యతరగతికి పడిపోయారని గణాంకాలు చెబుతున్నారు. కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని చెబుతున్నారు. అయినా ప్రభుత్వాలకు కనికరం లేదు. వంట గ్యాస్ కొనేవారు కూడా తగ్గిపోతున్నారు. జనారణ్యం అయిన ముంబైలో 21 శాతం మంది గ్యాస్ వాడకాన్ని నిలిపివేశారని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడయింది.
వారెవరికీ గ్యాస్ కనెక్షన్లు లేక కాదు. వారందరికీ కకెన్షన్లు ఉన్నాయి. కానీ అది ఖరీదైన వ్యవహారం కావడంతో అంతా పక్కన పెట్టి పుల్లలు ఏరుకొచ్చుకుని వంట చేసుకుంటున్నారు. పట్నంలోనే ఇలా ఉంటే పల్లె జనం ఇక గ్యాస్ ఎలా వాడతారు. వారు మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారు. కనీస అవసరాల్ని కూడా ప్రభుత్వాలు ఖరీదుగా మార్చి.. ప్రజల్ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. పన్నులనే అభివృద్ధిగా చెప్పుకునే ప్రభుత్వాలున్నంత కాలం ప్రజల పరిస్థితి ఇలాగే దిగజారిపోతూ ఉంటుదనడంలో సందేహం లేదు.