విభజనతో పారిశ్రామికంగా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదనతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేటి నుంచి ఓ గుర్తింపు ఉండబోతోంది. చరిత్రలోనే తొలి సారిగా.. మేడిన్ ఆంధ్రా కారు.. రోడ్లపైకి పరుగులు పెట్టబోతోంది. మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ తన ప్లాంట్‌ను పెడుతుందని అనుకున్నప్పటికీ.. అప్పుడు తప్పిపోయింది. ఇప్పుడు.. సాకారం అయింది. బ్రాండ్ ఏపీని మేడిన్ ఆంధ్రా కియా కారు విశ్వవ్యాప్తం చేయనుంది.
దేశంలో ఎక్కడ “కియా” కనిపించినా గుర్తొచ్చేది ఏపీనే..!
కార్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ చేరింది. తొలి మేడిన్ ఆంధ్రా కారు.. రోడ్డు మీదకు వచ్చింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమలో తయారైన కార్లు డీలర్లకు చేరాయి. లాంఛనంగా నేడు మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. మిడ్ ఎస్యూవీ రంగంలో వస్తున్న తొలి కారు సెల్టోస్ ధర రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్ కార్లకు ఇది పోటీగా ఉంటుంది. తొలి బుకింగ్స్‌లోనే సెల్టోస్ సంచలనం సృష్టించింది. తొలి రోజే.. ఆరు వేల కార్లు బుక్ అయ్యాయి. ఇప్పటికి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. లక్షకుపైగా బుకింగ్‌లు వచ్చినట్లు.. ఆటోమోబైల్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వోక్స్ వ్యాగన్ మిస్.. కియా సూపర్ హిట్..!
పదిహేనేళ్ల కిందట.. ఏపీలో.. వోక్స్ వ్యాగన్ ప్లాంట్ పెట్టాలనుకుంది. కానీ అప్పట్లో… మిస్ అయింది. కానీ కొరియా దిగ్గజం కియా మాత్రం ఏపీలోనే పరిస్రమ పెట్టింది. అతి తక్కువ కాలంలోనే వేల కోట్లు వెచ్చించి పరిశ్రమను కియా నిర్మించింది. ఏటా మూడు లక్షలకుపైగా కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా కియా మోటార్స్‌కు ఇది 15వ ప్లాంట్. భారత్‌లో మాత్రం తొలి ప్లాంట్. 2021 నాటికి రెండో దశ పూర్తవుతుంది. 535 ఎకరాల్లో ప్రధాన ప్లాంట్ ను ఏర్పాటు చేసారు. కియా బ్రాండ్ పూర్తిగా కొత్త. కియా అనే కార్లు ఉన్నాయనే విషయమే చాలా మందికి తెలియదు. కియా పరిశ్రమ వస్తుందని చంద్రబాబు ప్రకటన చేసినప్పుడు.. అందరూ అదో మామూలు ప్రకటన అనుకున్నారు. కానీ శర వేగంగా ప్లాంట్ పూర్తయింది.
పారిశ్రామికీకరణ పరుగులకు తొలి అడుగు..!
మేడిన్ ఆంధ్రా ఉద్యమంలో ఇది తొలి అడుగు మాత్రమే. హీరో పరిశ్రమ ఏపీలో ప్లాంట్ పెడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబతోంది. అశోక్ లేలాండ్ కూడా.. ఎలక్ట్రిక్ బస్సులను రేపో మాపో లాంచ్ చేయబోతోంది. అవి కూడా పూర్తిగా మేడిన్ ఆంధ్రా బస్సులు. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ఇసుజు ప్లాంట్ నుంచి వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. అపోలో టైర్స్ పరిశ్రమ యూనిట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది తొలి బ్రాండ్ ఏపీ టైర్.. కార్లకు, లారీలకు, ద్విచక్ర వాహనాలకు తొడగనున్నారు. పారిశ్రామిక రంగంలో ఏపీ ఓపెనింగ్ అదుర్స్ అన్నట్లుగానే ఉంది. ఈ ఒరవడిని కొనసాగిస్తే.. తయారీలో రంగంలో ఏపీ దూసుకెళ్లే అవకాశాలే ఉన్నాయి.