హైదరాబాద్: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అని సామెత. తెలంగాణలోని పూజారులకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయింది. దేవుడులాంటి ప్రభుత్వం వరమిచ్చినా అధికారులు కనికరించటంలేదు. దేవాదాయశాఖ అధికారులపై అర్చక సంఘాలు మండిపడుతున్నాయి. గర్భగుడిలో తాము అగరొత్తుల పొగకు అనారోగ్యం పాలవుతూ ఉంటే, దక్షిణ ద్వారా తాము సేకరించిన సొమ్ముతో అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటున్నారని అర్చకులు విమర్శించారు. దేవాదాయశాఖలోని అర్చక, ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దేవాదాయశాఖ అధికారులు అడ్డుకోజూస్తున్నారని మండిపడ్డారు. తమ జీతాలకు అడ్డు తగిలితే అధికారుల అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలోని అర్చక ఉద్యోగులకు సెక్షన్ 65 ప్రకారం జీతాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుండగా, భవిష్యత్తులో తమకు ఇబ్బందులు తలెత్తుతాయన్న సాకుతో అడ్డుకునేందుకు అధికారులు ఉపక్రమించారు. దీంతో అర్చకసంఘాలు మండిపడుతున్నాయి. చిన్న ఉద్యోగంలో చేరి అడ్డదారుల్లో అధికారస్థాయికి ఎదిగిన వారి అవినీతి పనులు తమకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమయానికి జీతాలొచ్చినా, రాకపోయినా జీవితాలు నెట్టుకొచ్చామని, ప్రత్యేకరాష్ట్రంలో సమస్య పరిష్కారమవుతుండగా అధికారులు మోకాలు అడ్డుపెట్టటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆలయాల కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కావటంలో అధికారుల హస్తం ఉందని, తమ జీతాలను అడ్డుకుంటే ఎవరెవరు అవినీతికి పాల్పడిందీ వెల్లడిస్తామని అర్చకులు హెచ్చరిస్తున్నారు.