ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచితే అది నేరం. దానినే మరో మెట్టు ఎక్కించిది ఓటుకి నోటు కేసవుతుంది. దానినే మరో మెట్టు పైకి ఎక్కిస్తే బీహార్ రాష్ట్రానికి ఈరోజు మోడీ ఇచ్చిన రూ. 1.65 లక్షల కోట్ల హామీ అవుతుంది. ఈ మూడింటిలో మొదటి రెండింటినీ నేరాలుగా అందరూ భావిస్తారు. కానీ మూడవ దానిని మాత్రం వరంగా భావిస్తారు. మీడియా కూడా దానిని అదేవిధంగా వర్ణిస్తుంది. మొదటి రెండు పనులను గుట్టుగా చక్కబెట్టుకోవలసి వస్తుంది. ఈ మూడింటి లక్ష్యం ఓటర్లకు గాలం వేసి ఓట్లు దండుకోవడమేనని అందరూ అంగీకరిస్తారు. కానీ మూడవది మాత్రం ప్రజలు, మీడియా అందరి సమక్షంలో అధికారికంగా ప్రకటించవచ్చును? అది అందరికీ ఆమోదయోగ్యం కూడా!
మొదటి రెండు చర్యలు ప్రజలు, చట్టం, రాజకీయ పార్టీల దృష్టిలో తప్పు, నేరం, అనైతికం అయినప్పుడు మరి మూడవది తప్పుగా కనబడటం లేదంటే అది మన ఎన్నికల విధానంలో డొల్లతనం వలననే అని చెప్పక తప్పదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనంతవరకు రాజకీయపార్టీలు ఓటర్లకు ఎన్ని ఎరలయిన వేయవచ్చును. ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత టీవీలు, మిక్సీలు, ల్యాప్ టాపులు, సైకిళ్ళు వంటివి పంచుతామని కూడా ఓటర్లకు ఆశ చూపవచ్చును. కానీ అవేవీ మన చట్టం, ఎన్నికల సంఘం దృష్టిలో నేరాలు కావు, చట్ట వ్యతిరేకమయిన పనులు అంతకంటే కావు. కానీ అదే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత నిరుపేదలకు కేజీ బియ్యం ఇస్తామన్నా అది నేరమే.
మన ఎన్నికల విధానంలో ఈ లొసుగులనే మన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు విరివిగా ఉపయోగించుకొంటున్నాయి. దానినే అధికార దుర్వనియోగం అంటారని చెపితే ఎవరూ నమ్మబోరు. కానీ సీపీఐ నేత సీతారామ్ ఏచూరి అంతటివాడు చెపితే నమ్మకుండా ఉండలేము. ఈ ఏడాది నవంబర్ లో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎలాగయినా అధికారం దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది. కానీ అక్కడ కాంగ్రెస్ తో సహా ఏడు పార్టీలు జతకట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పైగా వాటిలో జేడీయు పార్టీ ఇప్పుడు బీహార్ లో అధికారంలో ఉంది. వాటినన్నిటినీ డ్డీకొని ఎన్నికలలో విజయం సాధించాలంటే ఆ పార్టీలు చేయలేని, వాటి శక్తికి మించిన ఎత్తు ఏదో ఒకటి వేయవలసి ఉంటుంది. ఆ ఎత్తే బీహార్ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65 లక్షల కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించడం. బహుశః ఆ ఏడు పార్టీలు కట్టకట్టుకొని పోరాడినా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు వేసిన ఈ ఎర ముందు వాటి ఆటలు కొనసాగవు.
కానీ అందుకోసం మోడీ తన పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం తన చేతిలో ఉన్న అపరిమితమయిన అధికారాన్ని దుర్వినియోగం చేసారని సీతారామ్ ఏచూరి విమర్శించారు. ఆయన చేసిన ఈ విమర్శ సహేతుకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు హుద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ కి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన తరువాత రూ. 1,000 కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించారు. మోడీ ప్రకటించిన ఆ సొమ్ము ఏమూలకి సరిపోదని అందరికీ తెలుసు. కానీ దాని కోసం చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు కేంద్రప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వచ్చిందో అందరూ చూసారు. చాలా అత్యవసరంగా అందించాల్సి సహాయానికి మోడీ మీనమేషాలు లెక్కించి చివరికి తుఫాను వచ్చిన ఆరు నెలల తరువాత అందులో సగం ఒకసారి, మిగిలిన సగం మరొకసారి ఎప్పుడో మంజూరు చేసారు.
కానీ ఇప్పుడు బీహార్ రాష్ట్రాన్ని ఏ తుఫాన్లు, వరదలు ముంచెత్తడం లేదు. మరో మూడు నెలల తరువాత అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఏకంగా రూ.1.65 లక్షల కోట్లను కుండపెంకులో, గులకరాళ్లో అన్నట్లుగా చాలా ఉదారంగా పంచిపెడుతున్నారు. కానీ 15 నెలల క్రితం పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా గురించి మాత్రం అయన మాట్లాడటం లేదు. ఎందుకంటే ఏపీలో మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కనుకనే. ఆ లెక్కన చూస్తే ఒకవేళ బీహార్ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు రాకపోయుంటే బీహార్ ని కూడా మోడీ పట్టించుకొనేవారు కాదనే భావించవచ్చును.
గతేడాది సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో బీహార్ ప్రజలు తమ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.50,000 కోట్లు ఇచ్చి ప్రజల ఋణం తీర్చుకొంటానని ఆనాడు నరేంద్ర మోడీ మీడియా సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ఆ ఋణం తీర్చుకోన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరో రూ.1.65 లక్షల కోట్లు రుణపడిపోవడానికి ఆయన సిద్దపడిపోతున్నారు. కానీ ఆంద్రప్రదేశ్ ఋణం తీర్చుకోవడానికి మాత్రం 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు చెపుతోందిట! రేపు బీహార్ కి కూడా అదే సమస్య వచ్చినా ఆశ్చర్యం లేదు.