బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం చెందడం, వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, తెరాసలకు ఒక బలమయిన ఆయుధాన్ని అందిస్తే, బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ ఓడిపోగానే అందరికంటే ముందుగా తెరాసకు చెందిన మంత్రి కే. తారక రామారావు స్పందించేరు. “బిహార్ ఎన్నికలలో గెలవడానికి లక్షల కోట్లు మోడీ ఇవ్వజూపినప్పటికీ, బిహార్ ప్రజలు నిర్ద్వందంగా బీజేపీని తిరస్కరించారని, అంతిమంగా నీతి నిజాయితీ సమర్ధమయిన పరిపాలనకే బిహార్ ప్రజలు మొగ్గు చూపారని” కేటీఆర్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల నేపధ్యంలో కేటీఆర్ ‘నీతి నిజాయితీ సమర్ధమయిన పరిపాలన’ గురించి ఎందుకు మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడు రోజుల పర్యటన కోసం మోడీ బ్రిటన్ దేశానికి వెళ్ళడాన్ని కూడా కేటీఆర్ వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి చాలా తెలివిగా ఉపయోగించుకొన్నారు.
“ప్రధాని నరేంద్ర మోడికి విదేశాలు వెళ్ళడానికి తీరిక ఆసక్తి ఉంటాయి కాని కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం ఎలా ఉందో తెలుసుకొనేందుకు తీరిక ఆసక్తి లేవు. ఆయన ప్రధాని అయిన తరువాత ఒక్కసారి రాష్ర్టంలో పర్యటించలేదు. రాష్ట్రానికి రాకపోయినా అవసరమయిన నిధులు విడుదల చేసినా బాగుండేది. అదీ చేయడం లేదాయన. పత్తి రైతుల దయనీయమయిన పరిస్థితి గురించి కేంద్రానికి ఎన్ని లేఖలు వ్రాసినా స్పందన లేదు,” అని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మోడీ ప్రభుత్వంపై చేస్తున్న ఈ ఆరోపణలకు వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ నేతలు జవాబు చెప్పుకోవడం కష్టమే. సాక్షాత్త్ ప్రధాని మోడీకే తెలంగాణా రాష్ట్రం పట్ల ఆసక్తి లేనప్పుడు ఇక బీజేపీలో కొత్తగా జేరి పోటీ చేస్తున్న డా. దేవయ్య మాత్రం ఏమి చేయగలరనే అభిప్రాయం ప్రజలకి కల్పించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని అర్ధం అవుతోంది. మరి ఆయన ఆరోపణలకి బీజేపీ నేతలు ఏవిధంగా సమాధానం చెపుతారో చూడాలి.