ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రధాని మోడీని కలిసి రావడం గొప్ప రాజకీయ విజయమైనట్టు వైసీపీ ఆర్భాటం చేసింది. తెలుగుదేశం ఉడుక్కుంది. కాని ఇప్పుడు చూడండి- తమిళనాడులో తమాషాలు చేసిన కీలుబొమ్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు కూడా ప్రధాని అపాయంట్మెంట్ ఇచ్చారు. ఏం మాట్లాడారంటే చెప్పరు. ఆయన వర్గాన్ని బిజెపిలో కలుపుకుంటారని ఒక కథనం వచ్చింది. అయితే ఇంతలోనే ముఖ్యమంత్రి ఫలని స్వామికీ ఇంటర్వ్యూ దక్కింది. ఏతావాతా తెలిసిందేమంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఓట్లు రాబట్టడం కోసం ప్రధాని ఎవరినీ వదలకుండా కలుసుకుంటారని. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మళ్లీ నిలబెట్టాలనే నితిష్ కుమార్ సూచనను బిజెపి నిష్కర్షగా తోసిపుచ్చింది. లేకలేక ఒక కాంగ్రెసేతర నేతను రాష్ట్రపతి భవన్లో కూచోబెట్టే అవకాశం వస్తే వదులుకోరాదని ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కూడా కొన్ని ఆలోచనలు వున్నాయని ఆయన అనుయాయులొకరు చెప్పారు. తనకు బాగా సన్నిహితులైన ప్రణబ్ ముఖర్జీని మరోసారి నిలబెడితే బావుంటుందని ఆయన కూడా అనుకున్నారట. ఆ ప్రతిపాదన ముందుకు తెచ్చి ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచన వెలిబుచ్చారట. అమిత్‌షాపై ఆగ్రహ వ్యాఖ్యలు చేసే సమయంలో కెసిఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాత్రమే అన్నారు. ఇప్పుడు నేను వారి ప్రవర్తన వల్ల గాయపడి వున్నా గనక మద్దతు ప్రకటించడానికి సమయం కాదు అని కూడా అన్నారు. బహుశా ఈ మాటల ప్రభావంతో బిజెపి కేంద్ర నాయకత్వం ఆయనను తప్పక సంప్రదిస్తుంది. అప్పుడు ఆయన తన సూచన చేసినా బిజెపి నిర్ణయానికే కట్టుబడతారని చెప్పొచ్చు. దేశ రాజకీయాలు మన్ను మాకేమీ సంబంధం లేదు తెలంగాణనే ముఖ్యమని స్పష్టంగా చెప్పేశారు కూడా.