ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించిన కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ట్రయల్ రన్ పూర్తి కాకముందే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇచ్చి ఎంతోమంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చారని మండిపడుతోన్న వేళ మోడీ కోవిన్ సర్టిఫికేట్లపై తన ఫోటోను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది.
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ జారీ చేసే కోవిన్ సర్టిఫికేట్లపై ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను తాజాగా తొలగించారు. మనమంతా కలిసి పోరాటం చేస్తే భారత్ కోవిడ్ 19ని ఓడించగలుగుతుందని మోడీ పేరుతో సర్టిఫికేట్లు ఉండేవి. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మోడీకా కమల్ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.
అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతోనే ఇతర ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రధాని ఫొటో తొలగించినట్లుగానే కోవిన్ పోర్టల్లోనూ మోడీ ఫొటోను అధికారులు తొలగించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.