రూమర్స్‌కు తెరదించి.. అసలైన వార్తలను ప్రజలకు ఇచ్చి.. ప్రజల్లో చైతన్యం తేవాల్సిన పత్రికలు అలాంటి భయాలకే.. పుకార్లకే బలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వైరస్.. దినపత్రికలపై ఎక్కువ కాలం నిలిచి ఉంటుందని.. ఏ మహానుభావుడు సోషల్ మీడియాలో ప్రచారం చేశారో కానీ.. చాపకింద నీరులా అది చాలా మంది మనసుల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. పేపర్లు పట్టుకోవాలంటనే.. జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో.. ఈ కరోనా గొడవ పూర్తయ్యే వరకూ.. పేపర్లు ఆపమని చెప్పేవారు ఎక్కువైపోయారు. దీంతో.. పత్రికల యాజమాన్యాలు… తాత్కలికంగా… ఆపేద్దామని అనుకున్నాయి. కానీ.. ఈ కరోనా కలకలం ఎంత కాలం ఉంటుందో తెలియదు.. ఒక్క సారి బ్రేక్ ఇస్తే.. మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభించడం.. పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారుతుందన్న ఉద్దేశంలో పునరాలోచన చేస్తున్నాయి.
దీంతో ఇప్పుడే… న్యూస్ పేపర్లపై కరోనా ఎక్కువ కాలం నిలిచి ఉంటుందనేది దుష్ప్రచారమేని చెబుతూ.. ఎదురు ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ప్రముఖ డాక్టర్లు.. నిపుణులతో… పైపర్లపై కరోనా వైరస్ ఉండదని.. చెప్పిస్తున్నారు. ప్రత్యేక ప్రోమోలు తయారు చేసి.. అనుబంధ టీవీ చానళ్లలో ప్రసారం చేయిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలకు ఎంత ఎక్కువ అవగాహన కల్పిస్తే.. అంత మంచిదని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడే.. తమ ప్రచార ఉద్ధృతి ప్రారంభించారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. న్యూస్ పేపర్ల వల్ల కరోనా రాదన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. పత్రికాధిపతులతో .. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా.. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి… కరోనాను ఎదుర్కోవడానికి తమదైన సలహాలిచ్చారు. అదే సమయంలో.. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మోడీ గుర్తు చేశారు. మోడీ అలా చెప్పిన తర్వాత పత్రికల ప్రింటింగ్ నిలిపివేస్తే బాగుండదేమో అన్న ఆలోచనకు వచ్చారు. ఇక తప్పదనే పరిస్థితి వస్తే ప్రింటింగ్ ఆపివేయడం తప్ప… ఇంకేం చేయలేమని.. కానీ ఆ పరిస్థితి రాకుండా వీలైనంత వరకూ ప్రయత్నించాలని దినపత్రికల యాజమాన్యాలు ఉన్నాయి.