తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు కాస్ట్ కంటింగ్ ట్రెండ్ మళ్లీ తెర మీదికి వచ్చింది. ప్రముఖ పత్రికా సంస్థల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే… తమ జీతాలు, జీవితాలు మారిపోతాయని సాక్షిలో చాలామంది అనుకున్నారు. అంతేకాదు, అందుకు తగ్గట్టుగానే గడచిన నాలుగేదేళ్లపాటు అహర్నిశలూ శ్రమించిన పాత్రికేయ సిబ్బంది చాలానే ఉన్నారు. తాజాగా సాక్షిలో అరకొర జీతాలు పెంచడంతో కొంత అసంతృప్తి వ్యక్తమౌతున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే, త్వరలో మేన్ పవర్ ని కుదించాలనే యోచనలో సాక్షి యాజమాన్యం ఉందనీ, ఆ తరువాత జీతాల పెంపు గురించి సీరియస్ గా ఆలోచిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి! ముందుగా ఈనాడులో కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్వాసన కార్యక్రమం మొదలైనట్టు కథనాలు వినిపిస్తున్నాయి. స్టాఫ్ ఫొటోగ్రాఫర్ల వ్యవస్థను తీసేద్దామనే యోచనలో ఉందని మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
స్టాఫ్ ఫొటోగ్రాఫర్లను పంపించే ప్రక్రియ ఇప్పుడు ఈనాడులో మొదలైందని టాక్! ఇప్పటికే కొంతమంది సీనియర్ ఫొటో గ్రాఫర్లకు యాజమాన్యం నుంచి ఫోన్లు వెళ్లాయనీ, వాళ్ల ముందు కొన్ని ఆఫర్లను ఈనాడు పెట్టిందని వినిపిస్తోంది. ఆ డీల్ ఎలా అంటే… ఒక ఫొటోగ్రాఫర్ కి మరో పదేళ్లు సర్వీసు ఉందనుకోండి… ఏడాదికి ఒక నెల చొప్పు, అంటే పదినెలల జీతాన్ని ఇచ్చి సాగనంపాలని భావిస్తున్నారట! లేదూ, ఫొటో గ్రాఫర్లుగా కొనసాగుతామని పట్టుబడితే… సదరు ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రాల్లో నెలకి కనీసం 10 ఫొటోలు మెయిన్ అడిషన్లో పబ్లిష్ కావాలట, అంటే.. ఆ స్థాయిలో ఫొటోలు ఉండాలనేది మరో డీల్ గా చెప్పుకుంటున్నారు. నిజానికి, పట్టణాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కంట్రిబ్యూటర్ల వ్యవస్థ ప్రింట్ మీడియాకి ఉంటుంది. వీళ్లకి లైన్ అకౌంట్లు ఉంటాయి. అలాగే, వాళ్లు పంపించిన ఫొటోలు పత్రికలో పబ్లిష్ చేస్తే… దానికీ అదనంగా కొంత చెల్లిస్తూ ఉంటారు. ఇక, జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లకు సంబంధించిన ఫొటోలు రాయిటర్స్, ఎ.ఎఫ్.పి. లాంటి ఏజెన్సీలు ద్వారా కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి, ప్రత్యేకంగా స్టాఫ్ ఫొటోగ్రాఫర్లను ఎందుకు నియమించుకోవాలి అనే ఆలోచనకు ఈనాడు వచ్చినట్టుగా ఉంది.
ఈనాడులో ఇలా జరుగుతోందట అనే కథనాలు వినిపించగానే… సాక్షి, ఆంధ్రజ్యోతి కూడా ఇదే ఫాలో అవుతాయా అనే చర్చ మీడియా వర్గాల్లో జరుగుతోంది. అంతేకాదు, ఇప్పుడు ఫొటోగ్రాఫర్లు.. వీళ్ల తరువాత సబ్ ఎడిటర్ల సంఖ్యను కుదించే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా ఆయా వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు సమాచారం.