అనుకున్నదంతా జరుగుతోంది. లాక్ డౌన్ కొన్ని వందల, వేల ఉద్యోగాలన్ని బలికొంటోంది. దానికి జర్నలిస్టులూ బలి కాబోతున్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే కొన్ని పత్రికలు ప్రింటింగ్ ఆపేశారు. ఇంకొన్ని పత్రికల సైజు సగానికి సగం తగ్గిపోయింది. సిటీ ఎడిషన్లు ఆగిపోయాయి. ఒక్కో పత్రిక కనీసం 50 నుంచి 70 శాతం నష్టాల్ని భరించాల్సివస్తోంది. ఈ ప్రభావం ఉద్యోగాలపై పడింది. డైలీ పేపర్ యాజమాన్యాలు ఇప్పుడు ఓ షార్ట్ లిస్టుని తయారు చేస్తున్నాయి. తమకు అక్కర్లేని సబ్ ఎడిటర్లని ఏరివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి దిన పత్రికల యాజమాన్యాలు ఓ లిస్టు తయారు చేసినట్టు భోగట్టా. ఆ ప్రకారం మూడు నెలల ముందస్తు జీతాలు చెల్లించి – హూస్టింగ్ ఆర్డరు చేతిలో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
కొన్ని దిన పత్రికలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి. కరోనా వల్ల మంచో, చెడో పేపర్ సైజు తగ్గింది. భవిష్యత్తులోనూ ఇదే సైజు కొనసాగించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయట. స్పెషల్ డెస్కుల్ని తొలగించాలని, అందుకోసం పనిచేస్తున్న కొంతమంది పాత్రికేయుల్ని ఇంటికి పంపించేసి, జీతాల భారం తగ్గించుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈనాడులో ఈ పరిస్థితి కొంచెం బెటర్. అక్కడ హూస్టింగులు లేవు గానీ, రిటైర్ అయి కూడా, సగం జీతానికి పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఇప్పుడు శాశ్వతంగా ఉద్యోగాల్ని వదులుకోవాల్సివస్తోంది. ప్రతి యేడాది దసరాకి బోనస్ ఇవ్వడం ఈనాడు ఆనవాయితీ. ఏప్రిల్ – మేలలో ఈఎల్స్కి సంబంధించిన పేమెంట్లు అందిస్తుంది. అయితే… ఈసారి ఈఎల్స్కి సంబంధించిన డబ్బులు రాకపోవొచ్చన్న భయం ఈనాడు ఉద్యోగులలో పట్టుకుంది.