బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందా ? పార్టీలో ఆయన ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగానే కుదిస్తున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ఫామ్ హౌజ్ పాలిటిక్స్ చేస్తుండటంతో పార్టీలో కేటీఆర్ వన్ మ్యాన్ షో నడుస్తుందనేది ఓపెన్ సీక్రెట్. కవిత కూడా కీరోల్ పోషించేందుకు పెద్ద, పెద్ద ప్రయత్నాలే చేస్తోంది. అన్నా, చెల్లెళ్లు పార్టీలో మరింత పట్టు బిగిస్తున్న సమయంలో హరీష్ అంటిముట్టినట్లు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలను కేటీఆర్ , కవితే ఎక్కువగా మానిటరింగ్ చేశారు. హరీష్ సిద్ధిపేట వరకు మాత్రమే పరిమితం అయ్యారు. కీలకమైన సమయంలో హరీష్ రోల్ నామమాత్రంగా మారడంపై కొద్దిరోజుల కిందటే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణంలోనూ కేసీఆర్ , కేటీఆర్ , కవిత ఫ్లెక్సీలు , హోర్డింగ్ లు భారీ స్థాయిలో పలుచోట్ల కనిపించగా.. హరీష్ హోర్డింగ్ లు మాత్రం అక్కడక్కడ మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం.
దీంతో , హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత కుదిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా… రజతోత్సవ సభకు హాజరై హోర్డింగ్ లను చూసిన హరీష్ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైనట్లుగా ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.