తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల వరద పారుతోంది. ఈ కేసుల దెబ్బకు పెద్ద పెద్ద నేతలు సైలెంటయ్యారు కానీ కార్యకర్తలు.. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పోరాడుతున్నారు. కేసుల పాలవుతున్నారు. జైళ్లకు కూడా వెళ్తున్నారు. ఇలాంటి వారికి తాము ప్రాధాన్యం ఇస్తానని.. వారిని పార్టీ కోసం పోరాడిన యోధులుగా గుర్తిస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ పార్టీ సర్వసభ్య సమావేశంలో తన సందేశాన్ని నేతలకు చంద్రబాబు క్లియర్గా వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలను చేస్తున్నట్లుగా నటించి.. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అరెస్టయ్యే నేతలతో ఇక తనకు పని లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదిరించి పోరాడే వారికే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు.
మూడున్నరేళ్లయినా కొంత మంది నేతలు ఇంకా పై పై రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. తానూ తిరుగుతున్నా.. కార్యకర్తలు కష్టపడుతున్నా కొంత మంది నేతలు మాత్రం ఇంకా కదలడం లేదన్నారు. పోలీసులను ఎదిరించి.. ప్రజల కోసం పార్టీ కోసం పని చేసేవారికే ఇక ముందు ప్రాధాన్యత ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకే నలభై శాతం సీట్లు ఇస్తామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలోచంద్రబాబు కీలక సిమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ నేతలపై ఇంకా వేధింపులు ఉంటాయని భావిస్తున్న ఆయన.. అక్రమ కేసుల పాలయ్యే టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తక్షణం వారికి న్యాయసాయం అందించేందుకు అన్ని నియోజకవర్గాల్లో లీగల్ టీముల్ని ఏర్పాటు చేుసకోవాలన్నారు. సర్వసభ్య సమావేశంలో పార్టీని పూర్తి స్థాయిలో లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 30 నియోజకవర్గాల నేతలు యాక్టివ్గా లేకపోవడంతో గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.