దేశంలో ప్రకటించకపోయినప్పటికీ హెల్త్ ఎమర్జెన్సీ ఉంది. వైరస్ బారిన పడుతున్నవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి…వైరస్‌పై జయించే పరిస్థితి లేదు. అత్యధికులకు ఆక్సిజన్ అవసరం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోఉన్న వైద్యావసరాలు సరిపోయే పరిస్థితి లేదు. కేంద్రం చేతుల్లో ఏం లేదు. ఇక చేయాల్సింది.. చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ఈ అంశంపై అవగాహన ఉన్న రాష్ట్రాలు ముందుగా ప్రైవేటు ఆస్పత్రుల్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి. కరోనా కేసులపై పోరాటంలో ముందున్న మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు… తమ రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులన్నింటినీ స్వాధీనం చేసుకుని కరోనా రోగులకు ఉచిత చికిత్స అందించడం ప్రారంభించాయి.
ప్రభుత్వ రంగంలో జానాభాకు తగినట్లుగా వైద్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయలేదు. స్థోమత లేని వారు మాత్రమే ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా.. పాలకులు ట్యూన్ చేశారు. అక్కడ అందే వైద్యం దైవాధీనం అని.. ఎంతోకొంత ఖర్చు పెట్టుకుని ప్రైవేటులో వైద్యం చేయించుకుంటే మంచిదనే పరిస్థితి కల్పించారు. అందువల్ల అన్ని చోట్లా ప్రైవేటు ి.చికిత్స పొందుతున్నారు. అనుమతుల్లేని చోట… అనధికారికంగానే చికిత్స నిర్వహిస్తున్నారు. కోవిడ్ చికిత్స చేయడానికి ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు అక్కర్లేదు.. సీరియస్ పేషంట్లకు మాత్రమే.. ప్రత్యేకంగా ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రప్రభుత్వాలు ప్రైవేటు ఆస్పత్రులను ఈ సంక్షోభం వరకు స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఆలోచన చేస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రైవేటు ఆస్పత్రుల స్వాధీనం గురించి చర్యలు తీసుకుంటూంటే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే చర్చ జరుగుతోంది. తెలుగురాష్ట్రాల్లో ప్రచారం వేరుగా ఉంది. తమ ప్రజలకు అద్భతమైన వైద్యం అందిస్తున్నామని బయటకు చెప్పుకుంటున్నారు. మీడియాలను గుప్పిట్లో పెట్టుకోవడంతో నిజాలు వెలుగులోకి రావడం లేదు. కానీ పరిస్థితి మాత్రం దుర్లభంగా ఉంది. టెస్టులు చేయించుకోవాలన్నా.. సాధ్యం కాని పరిస్థితి.కానీ ప్రైవేటు ఆస్పత్రుల పరిస్థితి మాత్రం మూడు కరోనా కేసులు.. ఆరు లక్షలు అన్నట్లుగా సాగుతోంది. ప్రజలు నిలువు దోపిడికి గురువుతున్నారు. అందుకే.. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత చికిత్స ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.